ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) మరో కీలక అడుగు వేసింది. దాదాపు 15 ఏళ్లుగా సాగుతున్న ఈ కేసుల విచారణలో భాగంగా దాల్మియా సిమెంట్స్ వ్యవహారంలో మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ బుధవారం (నవంబర్ 18) హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టులో తాజాగా 10వ చార్జిషీట్‌ను దాఖలు చేసింది.
గతంలో ఇదే వ్యవహారంలో ఈడీ దాఖలు చేసిన అభియోగపత్రాన్ని కొన్ని సాంకేతిక లోపాల కారణంగా న్యాయస్థానం వెనక్కి పంపగా, తాజాగా ఆయా లోపాలను సరిదిద్దడంతో పాటు అదనపు ఆధారాలు, అవసరమైన అనుమతులను జతచేసి అధికారులు కొత్త చార్జిషీట్‌ను సమర్పించారు.
ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళితే.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కడప జిల్లాలో 417 హెక్టార్ల సున్నపురాయి గనులను దాల్మియా సిమెంట్స్ సంస్థకు అక్రమంగా లీజుకు కేటాయించారని సీబీఐ గతంలోనే కేసు నమోదు చేసింది. ఇందుకు ప్రతిఫలంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి దాల్మియా సిమెంట్స్ సంస్థ నుంచి సుమారు రూ. 150 కోట్ల మేర అక్రమ లబ్ధి చేకూరిందని 2013లో దాఖలు చేసిన చార్జిషీట్‌లో సీబీఐ ఆరోపించింది.
ఇందులో భాగంగా రఘురాం సిమెంట్స్‌లో రూ. 95 కోట్ల విలువైన వాటాలను బదిలీ చేయడంతో పాటు, మరో రూ. 55 కోట్లను హవాలా మార్గాల ద్వారా చెల్లించినట్లు దర్యాప్తు సంస్థ పేర్కొంది. సీబీఐ నమోదు చేసిన అభియోగపత్రాల ఆధారంగా మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద దర్యాప్తు చేపట్టిన ఈడీ.. గతేడాది దాల్మియా సిమెంట్స్‌కు చెందిన సుమారు రూ. 793 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసిన సంగతి తెలిసిందే.
అయితే ఆస్తుల అటాచ్‌మెంట్ విలువ, నేరార్జన లెక్కలకు సంబంధించి పీఎంఎల్‌ఏ అప్పిలేట్ ట్రైబ్యునల్ జారీ చేసిన మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకున్న ఈడీ అధికారులు, ఆర్థిక లెక్కలు మరియు న్యాయపరమైన అంశాల్లో అవసరమైన సవరణలు చేసి పూర్తిస్థాయి ఆధారాలతో తాజాగా ఈ 10వ చార్జిషీట్‌ను సిద్ధం చేశారు. వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులకు సంబంధించి ఈడీ ఇప్పటికే 9 చార్జిషీట్లను దాఖలు చేయగా, కోర్టు వాటిని విచారణకు స్వీకరించింది.
మరోవైపు నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టులో ఈ కేసులపై రోజువారీ విచారణకు మార్గం సుగమమైన తరుణంలో, దాల్మియా సిమెంట్స్ వ్యవహారంలో ఈడీ తాజా అభియోగపత్రాన్ని దాఖలు చేయడం రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ, న్యాయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. న్యాయస్థానం ఈ చార్జిషీట్‌ను పరిశీలించి పరిగణనలోకి తీసుకున్న తర్వాత నిందితులకు సమన్లు జారీ చేసే అవకాశముంది.



































