సెమీకండక్టర్ రంగంలో భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత కీలకమైన నూతన పాలసీకి ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ఏర్పాటు చేసే సిలికాన్ ఫ్యాబ్‌లకు (Silicon Fabs) 80 శాతం వరకు పెట్టుబడి రాయితీ (క్యాపిటల్ సపోర్ట్) కల్పించనున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీకి సమానంగా రాష్ట్ర ప్రభుత్వం 100 శాతం మ్యాచింగ్ గ్రాంట్ (రూపాయికి రూపాయి సాయం) అందించనుందని ఆయన స్పష్టం చేశారు.
ఈ మేరకు ‘సెమీకండక్టర్ అండ్ డిస్ప్లే ఫ్యాబ్ పాలసీ 4.0’లో సవరణలు చేస్తూ ప్రభుత్వం జీవో నం.87ను జారీ చేసింది. భారతదేశ అవసరాలకు సరిపడా చిప్‌లను ఆంధ్రప్రదేశ్‌లోనే తయారు చేయాలన్నదే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0’కు అనుగుణంగా రూపొందించిన ఈ నూతన పాలసీ ద్వారా దేశంలోనే అత్యధిక రాయితీలు ఇస్తున్న రాష్ట్రంగా ఏపీ నిలవనుంది. దీని ప్రకారం సిలికాన్ ఫ్యాబ్‌లకు కేంద్రం 40 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం చొప్పున మొత్తం 80 శాతం క్యాపిటల్ సపోర్ట్ అందించనున్నాయి.
కాగా, ఇతర రాష్ట్రాల్లో ఒడిశా 65 శాతం, తమిళనాడు 65 శాతం, గుజరాత్ 56 శాతం మాత్రమే రాయితీలు ఇస్తుండగా ఏపీ ఏకంగా 80 శాతం ప్రోత్సాహకంతో ముందంజలో నిలిచింది. అలాగే కాంపౌండ్ సెమీకండక్టర్, ఫోటోనిక్స్, డిస్ప్లే ఫ్యాబ్, అడ్వాన్స్డ్ ప్యాకేజింగ్ యూనిట్లకు 70 శాతం వరకు, లెగసీ ప్యాకేజింగ్ యూనిట్లకు 50 శాతం వరకు పెట్టుబడి ప్రోత్సాహకాలు కల్పించనున్నారు.
మరోవైపు, ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో 5,000 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక సదుపాయాలతో భారీ ‘ఏపీ సెమీకండక్టర్ పార్క్’ (మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్) ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఈ పార్క్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన క్లీన్రూమ్స్, అల్ట్రా ప్యూర్ వాటర్, నిరంతర విద్యుత్ సరఫరా, టెస్టింగ్ ల్యాబ్‌లను నిర్మించనున్నారు.
పెట్టుబడిదారులకు సింగిల్ విండో అనుమతుల కోసం ముఖ్యమంత్రి నేతృత్వంలో ‘APSGIC’ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయడంతో పాటు, ఐఐటీ తిరుపతి వేదికగా ‘ఏపీ సెమీకండక్టర్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ (AP-SRIC)’ను ప్రారంభించనున్నారు. పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ‘AP-STCC’ ట్రైనింగ్ సెంటర్‌ను నెలకొల్పి, ఇక్కడ శిక్షణ పొందే ఒక్కో ట్రైనీకి నెలకు రూ. 10,000 చొప్పున ఆరు నెలల పాటు కంపెనీలకు శిక్షణ రాయితీ అందించనున్నారు.
స్టార్టప్‌లు మరియు మెగా ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు కూడా ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించింది. చిప్ డిజైన్ స్టార్టప్‌లకు రూ. 22.5 కోట్ల వరకు సీడ్ ఫండింగ్ (ఏపీ వాటా రూ. 7.5 కోట్లు) అందించడంతో పాటు యంత్రాలు, మెటీరియల్స్ కొనుగోలుపై కేంద్రం 30 శాతం, రాష్ట్రం 18 శాతం చొప్పున మొత్తం 48 శాతం సాయం చేయనున్నాయి.
రూ. 1,000 కోట్లకు పైగా పెట్టుబడితో ఏర్పాటయ్యే మెగా, అల్ట్రా మెగా ప్రాజెక్టులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు కల్పించనున్నారు. ‘సెమికాన్ 2.0’ పరిధిలోకి రాని ప్రాజెక్టులకు ఐదేళ్ల పాటు యూనిట్ విద్యుత్‌కు రూ. 3 చొప్పున సబ్సిడీ ఇవ్వనున్నారు. రాబోయే ఐదేళ్ల పాటు అమల్లో ఉండే ఈ నూతన పాలసీ ద్వారా దేశంలోనే అత్యంత చౌకగా ఫ్యాబ్‌ల నిర్మాణానికి ఏపీ వేదిక కానుందని మంత్రి లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు.




































