అగ్రరాజ్యం అమెరికాలో కోవిడ్-19(కరోనా వైరస్) ప్రభావం మరింత తీవ్ర రూపం దాల్చింది. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ తాజా సమాచారం ప్రకారం ఏప్రిల్ 15, బుధవారం రాత్రి 8 గంటల నుంచి ఏప్రిల్ 16, గురువారం రాత్రి 8 గంటల వరకు 24 గంటల్లో అమెరికాలో కరోనా వైరస్ వలన రికార్డు స్థాయిలో 4,591 మంది మరణించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడం మొదలయ్యాక అమెరికాలో ఇంతమంది మరణించడం ఇదే తొలిసారి. గురువారం వెల్లడించిన సంఖ్యలో కరోనా అనుమానిత మరణాలను కూడా కలిపి లెక్కించడం వలనే మరణాల సంఖ్య భారీగా పెరిగినట్టు చెబుతున్నారు. అంతకుముందు అత్యధికంగా 24 గంటల్లో 2569 మంది మరణించారు.
కొత్తగా నమోదైన 4,591 మరణాలతో కలిపి అమెరికాలో కరోనా మరణాల సంఖ్య 34,662 కు చేరింది. మరోవైపు అక్కడ కరోనా బాధితుల సంఖ్య 6,75,000 దాటింది. కరోనా కట్టడికి అమెరికా ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. అమెరికాలో వైరస్ వ్యాప్తి ఎక్కువుగా ఉన్న న్యూయార్క్ రాష్ట్రంలోనే అత్యధికంగా 12 వేల మందికి పైగా మరణించారు. 22,000 పైగా కరోనా మరణాలతో ఇటలీ రెండో స్థానంలో, 19,500 కు పైగా మరణాలతో స్పెయిన్ మూడో స్థానంలో, 18,000 మరణాలతో ఫ్రాన్స్ నాలుగో స్థానంలో నిలిచింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu