ఎల్‌నినో ఎఫెక్ట్: ఐరోపాలో రికార్డ్ ఉష్ణోగ్రతలు.. 50 వేల మందికి పైగా మృతి

El Nino Shatters on Europe, Over 50,000 People Lost Lives in a Period of June-August

ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలను వణికిస్తున్న ఎల్ నినో ఐరోపా ఖండంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. సాధారణంగా చలి వాతావరణానికి, మితమైన ఉష్ణోగ్రతలకు ప్రసిద్ధి చెందిన ఐరోపా ఖండం ఈసారి వేసవిలో విపరీతమైన ఉష్ణోగ్రతలు, వడగాలులతో వణికిపోతోంది. ఎల్‌నినో పరిస్థితులతో పాటు మానవ తప్పిదాల వల్ల ఏర్పడిన పర్యావరణ మార్పులు తోడవడంతో ఐరోపా దేశాలు భయానక వాతావరణాన్ని ఎదుర్కొన్నాయి.

ఈ నేపథ్యంలో.. ఐరోపా ఖండంలోని వివిధ దేశాల్లోని 854 నగరాల్లో జూన్, జులై, ఆగస్టు నెలల్లో సంభవించిన భీకర వడగాలుల తీవ్రతకు ఏకంగా 50,391 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తాజా శాస్త్రీయ అధ్యయనంలో వెల్లడైంది.

ఇంపీరియల్ కాలేజ్ లండన్ పరిశోధకులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ వేసవిలో ప్రాణాలు కోల్పోయిన వారిలో సుమారు రెండు మూడో వంతు (32,619) మరణాలకు బొగ్గు, చమురు, గ్యాస్ వంటి శిలాజ ఇంధనాలను మండించడం వల్ల పెరిగిన విపరీతమైన ఉష్ణోగ్రతలే ప్రధాన కారణమని తేలింది.

రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదైన 2022 సంవత్సరంతో పోలిస్తే ఈసారి మరణాల సంఖ్య ఏకంగా 71 శాతం ఎక్కువగా ఉండటం గమనార్హం. ఐరోపాలో సాధారణంగా ఉష్ణోగ్రతలు 12-35 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండాల్సి ఉండగా, ఈ ఏడాది ఫ్రాన్స్‌లో 43.8 డిగ్రీలు, జర్మనీలో 41.7, బ్రిటన్‌లో 37.3 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

పర్యావరణ మార్పుల తీవ్రత కారణంగా ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీ దేశాలు అత్యధిక ప్రాణనష్టాన్ని చవిచూశాయి. మరణించిన వారిలో సగం మందికి పైగా 85 ఏళ్లకు పైబడిన వృద్ధులే ఉండటం ఆందోళనకరమని నిపుణులు పేర్కొన్నారు. కేవలం జూన్ 17 నుంచి జులై 1 మధ్య కాలంలోనే మూడో వంతు మరణాలు సంభవించాయని అధ్యయనం స్పష్టం చేసింది.

మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వాలు ముందస్తు రక్షణ చర్యలు తీసుకోవడంలో విఫలమవడం వల్లే ఇంతటి పెను ప్రమాదం వాటిల్లిందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here