ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు భారీ స్వచ్ఛంద నిష్క్రమణ ప్యాకేజీని ప్రకటించింది. భారత్, అమెరికా, బ్రిటన్, కెనడా దేశాల్లోని దాదాపు 60,000 మంది ఉద్యోగులకు ఈ బైఅవుట్ ఆఫర్‌ను అందిస్తున్నట్లు ఆ సంస్థ చీఫ్ పీపుల్ ఆఫీసర్ అమీ కోల్మాన్ వెల్లడించారు. మైక్రోసాఫ్ట్ మొత్తం ఉద్యోగ బృందంలో దాదాపు నాలుగో వంతు మందికి పైగా (2.23 లక్షల మంది ఉద్యోగులు) ఈ ఆఫర్ వర్తించనుంది.
ఈ స్వచ్ఛంద నిష్క్రమణ ఆఫర్‌కు ఎలాంటి వయసు లేదా సర్వీసు పరిమితి లేకపోవడం విశేషం. ఉద్యోగుల పనితీరుతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ ఆఫర్ వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఈ నాలుగు దేశాల్లో జనరల్ మేనేజర్లు, వైస్ ప్రెసిడెంట్ స్థాయి వరకు (లెవెల్ 70 వరకు) ఉన్న ఉద్యోగులకు ఈ అవకాశం కల్పించారు. అర్హత ఉన్న ఉద్యోగులకు వ్యక్తిగత నిబంధనలతో ఈమెయిల్ ద్వారా సమాచారం అందిస్తామని, డిసెంబర్ మొదటి వారం లోపు నిర్ణయం తెలపాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
ఈ ఆఫర్‌ను అంగీకరించిన వారు ఈ ఏడాది చివరి నాటికి సంస్థ నుంచి రిలీజ్ కానున్నారు. సాధారణ సెవరాన్స్ ప్యాకేజీ మాదిరిగానే బేస్ పే, స్టాక్ వెస్టింగ్, హెల్త్‌కేర్ మరియు కెరీర్ ట్రాన్సిషన్ సపోర్ట్ వంటి ప్రయోజనాలు ఈ ప్యాకేజీ కింద లభిస్తాయని కంపెనీ వెల్లడించింది. అయితే క్లౌడ్ అండ్ ఏఐ, సెక్యూరిటీ, సేల్స్ వంటి కొన్ని కీలక విభాగాలు ఈ ఆఫర్ పరిధి నుంచి మినహాయించబడ్డాయి.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మరియు డేటా సెంటర్ల విస్తరణ కోసం భారీగా నిధులు వెచ్చిస్తున్న నేపథ్యంలో.. నిర్వహణ ఖర్చులను నియంత్రించుకునే దిశగా మైక్రోసాఫ్ట్ ఈ వాలంటరీ ఎగ్జిట్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం చుట్టింది. సంస్థలో వ్యయ నియంత్రణ చర్యలు చేపడుతున్న తరుణంలో ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.









































