దిల్లీలోని భాజపా ప్రధాన కార్యాలయంలో పాత్రికేయుల కోసం నిర్వహించిన వార్షిక ‘దీపావళి మిలన్’ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరై కీలక ప్రసంగం చేశారు. దేశంలోని వివిధ రంగాల్లో భారత్ సాధిస్తున్న ప్రగతిని, విజయగాథలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు మీడియా మరింత కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.
గత 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ చర్యల ఫలితంగా సుమారు 50 కోట్ల మంది పేదరిక రేఖకు దిగువ నుంచి బయటపడ్డారని ప్రపంచ బ్యాంకు గణాంకాలు చెబుతున్నాయని ప్రధాని గుర్తుచేశారు. ఒకప్పుడు కేవలం ‘గరీబీ హటావో’ నినాదాలు మాత్రమే ఉండేవని, కానీ తమ ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పేదరిక నిర్మూలనకు కట్టుబడి పని చేసిందని స్పష్టం చేశారు.
మాధ్యమాలతో తనకూ సుదీర్ఘకాలంగా అనుబంధం ఉందని, జర్నలిజం రంగం ప్రెస్ రిలీజ్ల కాలం నుంచి నేటి ఇన్స్టాగ్రామ్ రీల్స్ యుగం వరకు ఎంతగానో పరిణామం చెందిందని మోదీ పేర్కొన్నారు. భాజపాలో చేరిన తొలినాళ్లలో దిల్లీ కార్యాలయంలో మీడియా ఈవెంట్లకు కుర్చీలు వేసే బాధ్యత తనదేనని జ్ఞాపకాలను పంచుకున్నారు.
విపత్తులు, సంక్షోభ సమయాల్లోనూ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా క్షేత్రస్థాయిలో రిపోర్టింగ్ చేసే జర్నలిస్టుల అంకితభావాన్ని ప్రశంసించారు. దేశాన్ని మాదకద్రవ్యాల (డ్రగ్స్) బారిన పడకుండా కాపాడేందుకు మీడియా మరింతగా ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరారు. భారత్ భవిష్యత్తులో తప్పకుండా ఒక అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు.








































