అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రష్యా విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్ పై రష్యా దాడి చేస్తున్న నేపథ్యంలో రష్యాపై మరిన్ని ఆంక్షల్ని విధించారు. రష్యా నుంచి ఆయిల్ (చమురు), గ్యాస్, ఇతర ఇంధన దిగుమతులపై నిషేధం విధిస్తున్నట్లు జో బైడెన్ మంగళవారం నాడు ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రష్యా విషయంలో ఇతర యూరప్ దేశాలు తమతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా లేవని, అయినప్పటికీ తాము అర్థం చేసుకుంటామని అన్నారు. రష్యా ఆయిల్ కు ఇకపై అమెరికా నౌకాశ్రయాలలో అనుమతి ఉండదని మరియు అమెరికన్ ప్రజలు రష్యా అధ్యక్షుడు పుతిన్ కు మరో శక్తివంతమైన సమాధానం చెప్తారని పేర్కొన్నారు. ఈ మేరకు జో బైడెన్ పలు ట్వీట్స్ చేశారు.
ఉక్రెయిన్ పై దాడి పుతిన్ కు ఎప్పటికీ విజయం కాదని, ఇది ఇప్పటికే చాలా స్పష్టంగా ఉందన్నారు. పుతిన్ ఒక నగరాన్ని తీసుకోగలరు కానీ అతను ఎప్పటికీ దేశాన్ని పట్టుకోలేడన్నారు. మరోవైపు ఈ చర్యతో అమెరికాలో ఇంధన ధరలను పెరగడంపై కూడా బైడెన్ స్పందించారు. పర్యావరణ నిబంధనలను సడలించడం ద్వారా ధరలు తగ్గవన్నారు. అయితే క్లీన్ ఎనర్జీతో నడిచే ఎలక్ట్రిక్ వాహనాలతో నడిచేలా అమెరికా ఆర్థిక వ్యవస్థను మార్చడం వల్ల గ్యాస్ ధరల గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. పుతిన్ వంటి వారు ఇంధనాలను ఆయుధంగా ఉపయోగించలేరని అన్నారు. దీర్ఘకాలంలో అమెరికా ఆర్థిక వ్యవస్థను రక్షించుకోవడానికి, ఎనర్జీ/ఇంధనాల విషయంలో స్వతంత్రంగా మారాలనే విషయాన్ని ఈ సంక్షోభం ద్వారా నేర్చుకోవాలన్నారు. క్లీన్ ఎనర్జీ భవిష్యత్తుకు మరింత వేగవంతంగా మారేలా చేయడానికి ఈ పరిస్థితులు ప్రజల్ని ప్రేరేపించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ