భారత యువ క్రికెట్ సంచలనం, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ మైదానంలో పరుగుల సునామీ సృష్టిస్తూ పురుషుల లిస్ట్-ఏ క్రికెట్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని ప్రపంచ రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. దోహా వేదికగా మంగళవారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)తో జరిగిన ‘ఏసీసీ రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ 2026’ మ్యాచ్‌లో భారత్-ఏ తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగిన వైభవ్ కేవలం 53 బంతుల్లోనే 204 పరుగులు సాధించి పెను విధ్వంసం సృష్టించాడు.
ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ఆకాశమే హద్దుగా చెలరేగిన వైభవ్ కేవలం 16 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత మరింత రెచ్చిపోయి 28 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకుని వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. 384.90 స్ట్రైక్ రేట్‌తో సాగిన ఈ అద్భుత ఇన్నింగ్స్‌లో ఏకంగా 28 భారీ సిక్సర్లు, 7 ఫోర్లు బాది యూఏఈ బౌలర్లను బెంబేలెత్తించాడు.
కాగా, అంతకుముందు అత్యంత వేగవంతమైన లిస్ట్-ఏ సెంచరీ రికార్డ్ ఆస్ట్రేలియా బ్యాటర్ జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్ (29 బంతులు) పేరిట ఉండేది. ఇక కేవలం 40 బంతుల్లోనే 150 పరుగుల మైలురాయిని దాటి ఏబీ డివిలియర్స్ (64 బంతులు) రికార్డును అధిగమించిన వైభవ్, 52 బంతుల్లోనే డబుల్ సెంచరీ పూర్తి చేసి ఔరా అనిపించాడు. న్యూజిలాండ్ బ్యాటర్ చాద్ బౌస్ (103 బంతులు) పేరిట ఉన్న అత్యంత వేగవంతమైన ద్విశతక రికార్డును ఏకంగా 51 బంతుల తేడాతో తిరగరాశాడు.
ఈ క్రమంలో ఒకే లిస్ట్-ఏ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ప్రపంచ రికార్డును కూడా వైభవ్ సూర్యవంశీ తన ఖాతాలో వేసుకున్నాడు. గతంలో ఆస్ట్రేలియా ఆటగాడు డార్సీ షార్ట్ (23 సిక్సర్లు) మరియు భారత ఆటగాళ్లు రోహిత్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్ (16 సిక్సర్లు) పేరిట ఉన్న రికార్డులను అధిగమిస్తూ ఏకంగా 28 సిక్సర్లు కొట్టాడు. అంతేకాకుండా 15 ఏళ్ల 242 రోజుల వయసులో లిస్ట్-ఏ క్రికెట్‌లో డబుల్ సెంచరీ సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగానూ అరుదైన చరిత్ర సృష్టించాడు.
వైభవ్ అసాధారణ బ్యాటింగ్ దెబ్బకు యూఏఈ నిర్దేశించిన 250 పరుగుల లక్ష్యాన్ని భారత్-ఏ జట్టు కేవలం 14.2 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. జట్టు విజయానికి 5 పరుగుల దూరంలో 13వ ఓవర్లో బసిల్ హమీద్ బౌలింగ్‌లో వైభవ్ అవుటై పెవిలియన్‌కు చేరుతుండగా, స్టేడియంలోని ప్రేక్షకులంతా నిలబడి చప్పట్లతో నీరాజనం పలికారు. 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిన భారత్-ఏ జట్టు రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ సెమీఫైనల్‌లోకి ఘనంగా అడుగుపెట్టింది.
వైభవ్ సూర్యవంశీ నెలకొల్పిన సరికొత్త రికార్డులు ఇవే..!
- లిస్ట్ ‘ఎ’ క్రికెట్‌లో అత్యంత వేగంగా సెంచరీ (28 బంతుల్లో 100)
- అత్యంత వేగంగా 150 (40 బంతుల్లో)
- అత్యంత వేగంగా 200 (52 బంతుల్లో)
- అలాగే లిస్ట్ ‘ఎ’ క్రికెట్‌లో డబుల్ సెంచరీ సాధించిన అతి పిన్నవయస్కుడి(15 ఏళ్ల 242 రోజులు)గా కూడా వైభవ్ నిలిచాడు.
- వేగవంతమైన అర్ధ శతకం (11 బంతుల్లో, శ్రీలంక ‘ఎ’పై) రికార్డు ఇదివరకే వైభవ్ అందుకున్నాడు.
- ఇక ఏ ఫార్మాట్‌లోనైనా ఒక ఇన్నింగ్స్‌లో ఎక్కువ సిక్సర్లు (28) బాదిన బ్యాటర్‌గా వైభవ్ రికార్డుకెక్కాడు.
భారత్ పేరిట నయా రికార్డులు నమోదు
- తొలి 10 ఓవర్లలోనే అత్యధిక పరుగులు (183) చేసిన జట్టుగా భారత్ ‘ఎ’ నిలిచింది.
- లిస్ట్ ‘ఎ’ వన్డేల్లో ఓ జట్టు (భారత్) 5 ఓవర్లలోనే 100 రన్స్ చేయడం ఇదే తొలిసారి.
స్కోరు బోర్డు
యూఏఈ: ఆర్యాన్ష్ (సి) కుశాగ్ర (బి) హర్షిత్ 2, అన్ష్ టాండన్ (సి) అభిషేక్ (బి) అర్షద్ 8, హర్‌ప్రీత్ (బి) అర్షద్ 130, షహదాద్ (ఎల్బీ) దూబే 28, డిసౌజా (సి) హర్షిత్ (బి) షాబాజ్ 25, అఫ్తాబ్ (సి) సూర్యాన్ష్ (బి) అర్షద్ 2, బాసిల్ (నాటౌట్) 36, ఇబ్రార్ (సి) తిలక్ (బి) అర్షద్ 0, జహీద్ (సి) తిలక్ (బి) సూర్యాన్ష్ 7, ఉద్దిష్ (నాటౌట్) 1, ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: 50 ఓవర్లలో 249/8.
వికెట్ల పతనం: 1-2, 2-20, 3-91, 4-151, 5-154, 6-220, 7-220, 8-243.
బౌలింగ్: హర్షిత్ 10-0-63-1, అర్షద్ 10-0-43-4, సూర్యాన్ష్ 10-0-48-1, హర్ష్ దూబే 7-0-28-1, తిలక్ 4-0-21-0, రింకూ 5-0-22-0, షాబాజ్ 4-0-23-1.
భారత్ ‘ఎ’: వైభవ్ (సి) ఆర్యాన్ష్ (బి) బాసిల్ 204, అభిషేక్ (ఎల్బీ) ఇబ్రార్ 12, ప్రభ్‌సిమ్రన్ (సి) అఫ్తాబ్ (బి) జహీద్ 3, రింకూ (నాటౌట్) 27, కుశాగ్ర (నాటౌట్) 1, ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 14.2 ఓవర్లలో 254/3.
వికెట్ల పతనం: 1-68, 2-108, 3-245.
బౌలింగ్: జహీద్ 4-0-52-1, ఇబ్రార్ 3-0-71-1, బాసిల్ 3.2-0-59-1, సిమ్రన్‌జీత్ 2-0-22-0, ఉద్దిష్ 2-0-48-0.







































