త్వరలో లక్ష మందితో కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుల సందర్శన – బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

BRS Chief KCR’s Key Directions To Party MLAs and MLCs Ahead of Telangana Assembly Session

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనపై బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వం పాలనపై దృష్టి పెట్టకుండా రాజకీయ విమర్శలు, వ్యక్తిగత వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఇస్తోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బూతులు మాట్లాడుతున్నారని, పాలన చేతకాకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని కేసీఆర్‌ విమర్శించారు. తెలంగాణలో ప్రస్తుతం కొనసాగుతున్నది ‘థర్డ్‌ క్లాస్‌ పాలన’ అని వ్యాఖ్యానించారు.

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆదివారం సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష సమావేశాన్ని కేసీఆర్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు.

ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలి

అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలకు బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా హాజరుకావాలని కేసీఆర్‌ సూచించారు. ప్రతి చర్చలో చురుగ్గా పాల్గొంటూ ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. అధికార పార్టీ నేతలు తన గురించి సభలో మాట్లాడితే వాటిని పట్టించుకోవద్దని, వ్యక్తిగత విమర్శలకు సమయం కేటాయించకుండా ప్రజా సమస్యలపైనే దృష్టి పెట్టాలని సూచించారు.

ప్రజల ఎజెండానే బీఆర్‌ఎస్‌ ఎజెండాగా ఉండాలని కేసీఆర్‌ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌, బీజేపీ విధానాలను ఎండగట్టడంతో పాటు స్పీకర్‌ పక్షపాత ధోరణి, అప్రజాస్వామిక విధానాలపై సభలో గట్టిగా ప్రశ్నించాలని నేతలకు సూచించారు.

తెలంగాణ రైజింగ్‌ కాదు.. ఫాలింగ్‌

కాంగ్రెస్‌ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలన అట్టర్‌ ఫ్లాప్‌ అయిందని కేసీఆర్‌ విమర్శించారు. తెలంగాణలో ఎక్కడా ఆశించిన స్థాయిలో ప్రగతి కనిపించడం లేదని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ‘తెలంగాణ రైజింగ్‌’ కాదని, ‘తెలంగాణ ఫాలింగ్‌’ స్పష్టంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్‌ నేతలు రాజకీయ విమర్శల విషయంలో దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డ కేసీఆర్‌.. పదేపదే తన చావును కోరుకుంటూ ప్రసంగాలు చేస్తున్నారని ఆరోపించారు. మరోవైపు తాను అసెంబ్లీకి రావాలని ధర్నాలు చేయడం ఏంటని ప్రశ్నించారు. పాలనలో ఎదురవుతున్న సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని కేసీఆర్‌ ఆరోపించారు.

నీటి ప్రాజెక్టులపై పోరాటం

కృష్ణా, గోదావరి జలాల అంశాన్ని ప్రధానంగా తీసుకుని పోరాటం చేయాలని బీఆర్‌ఎస్‌ నేతలకు కేసీఆర్‌ సూచించారు. బీఆర్‌ఎస్‌పై రాజకీయ కక్షతో కాళేశ్వరం ప్రాజెక్టును పక్కన పెట్టారని ఆరోపించారు.

ఎల్‌నినో ప్రభావంతో నీటి కొరత ఏర్పడే అవకాశం ఉన్న సమయంలో నీటిని ఎత్తిపోసి నిల్వ చేయాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. సాగునీటి రంగానికి జరుగుతున్న నష్టాన్ని ప్రజలకు వివరించాలని పార్టీ నేతలకు సూచించారు.

లక్ష మందితో ప్రాజెక్టుల సందర్శన

కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వ వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు త్వరలో భారీ కార్యక్రమం నిర్వహిస్తామని కేసీఆర్‌ తెలిపారు. లక్ష మందితో కలిసి ఆయా ప్రాజెక్టుల వద్దకు వెళ్లి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రజలకు వివరిస్తామని చెప్పారు.

రాష్ట్రంలోని నీటి వనరులు, సాగునీటి ప్రాజెక్టులపై ప్రజలకు వాస్తవ పరిస్థితులను వివరించాల్సిన బాధ్యత బీఆర్‌ఎస్‌పై ఉందని పేర్కొన్నారు.

నియోజకవర్గాల పునర్విభజనపైనా దృష్టి

వచ్చే ఎన్నికల నాటికి అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశం ఉందని కేసీఆర్‌ పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని సూచించారు.

అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తాల్సిన సుమారు 20 కీలక అంశాలపై కేసీఆర్‌ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.

భేటీకి మహిపాల్‌రెడ్డి హాజరు

ఇదిలా ఉండగా, గతంలో కాంగ్రెస్‌ పార్టీ కండువా కప్పుకున్న పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఎర్రవల్లిలో జరిగిన బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష సమావేశానికి హాజరు కావడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్‌ నిర్వహించిన ఈ భేటీ నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి వాతావరణం నెలకొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here