రేపు కేసీఆర్‌ అధ్యక్షతన బీఆర్‌ఎస్ఎల్పీ భేటీ.. అసెంబ్లీ వ్యూహంపై కీలక చర్చ

KCR To Chair BRS Legislature Party Meeting For Discussing Assembly Strategy

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష సమావేశాన్ని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్వహించనున్నారు. ఆదివారం ఎర్రవెల్లిలో మధ్యాహ్నం ఈ సమావేశం జరగనుంది.

పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్‌ సమావేశమై అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి వెయ్యి రోజులు పూర్తయినప్పటికీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో జాప్యం జరుగుతోందని బీఆర్‌ఎస్‌ ఆరోపిస్తోంది.

ఈ అంశంతో పాటు ప్రభుత్వ పాలనా తీరుపై సమీక్ష, వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. అసెంబ్లీలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఎలా ప్రశ్నించాలి, ప్రజా సమస్యలను ఏ విధంగా ప్రస్తావించాలనే దానిపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్‌ దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది.

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభానికి ఒక రోజు ముందు జరుగుతున్న ఈ భేటీకి రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది. సమావేశంలో చర్చించిన అంశాల ఆధారంగా శాసనసభలో బీఆర్‌ఎస్‌ అనుసరించబోయే కార్యాచరణపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here