తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని, ఈ విషయంలో ఎలాంటి శక్తికీ లొంగేది లేదని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. “ఢిల్లీలో ఉన్న ప్రధాని మోదీకైనా, ఫామ్‌హౌస్‌లో పడుకున్న కేడీకైనా భయపడే ప్రసక్తే లేదు” అని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
ఈ మేరకు తన సొంత నియోజకవర్గం కొడంగల్ పర్యటనలో భాగంగా మూడో రోజైన సోమవారం హకీంపేటలో నిర్వహించిన భారీ రైతు ఆత్మీయ బహిరంగ సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు విపక్షాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
కొడంగల్ నియోజకవర్గంలో రూ. 9,053 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి, హకీంపేట సభకు ముందు వేలాది మంది ప్రజలతో కలిసి పాదయాత్రగా తరలివచ్చారు. దారిలో పోలెపల్లి శ్రీ ఎల్లమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం లగచర్లలోని ఇండస్ట్రియల్ కారిడార్‌లో ఎకో పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి భూమిపూజ చేశారు.
తెలంగాణ అభివృద్ధి కోసం రాత్రింబవళ్లు 18 గంటలు కష్టపడుతున్నానని, సీఎం అయినప్పటి నుంచి ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా ప్రజల సేవే పరమావధిగా నిరంతరం శ్రమిస్తున్నానని ఆయన భావోద్వేగంగా పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఎల్-నినో ప్రభావంతో రాబోయే రోజుల్లో కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశాలున్నాయని, అయితే ఈ సమస్యను ప్రభుత్వం ప్రజలతో కలిసికట్టుగా ఎదుర్కొంటుందని సీఎం భరోసా ఇచ్చారు. “బియ్యానికి ఎలాంటి కొదవ లేదు, 12 నెలలకు సరిపడా సన్న బియ్యాన్ని ఖజానాలో నిల్వ చేశాం. ఈ ఒక్క సీజన్ వడ్లు పండించకపోయినా ఏడాదిపాటు ప్రజలకు ఇబ్బంది ఉండదు” అని తెలిపారు.
సంక్రాంతి పండుగ తర్వాత కొడంగల్ నుంచి ‘ప్రజాబలం’ కార్యక్రమాన్ని ప్రారంభించి రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తానని, కరువును తట్టుకునేలా కార్యాచరణ రూపొందిస్తామని స్పష్టం చేశారు. రైతులు నీటిని పొదుపుగా వాడుతూ ఆరుతడి పంటలపై దృష్టి సారించాలని కోరారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై విమర్శలు గుప్పిస్తూ.. కేసీఆర్ హయాంలో రూ. 8 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని ఊబిలో నెట్టారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. “ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణలో గతంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి తెచ్చారు. అలాంటిది తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి నెలా 1వ తేదీనే 5 లక్షల మంది ఉద్యోగులకు, 5వ తేదీకల్లా కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బందికి జీతాలు చెల్లిస్తున్నాం” అని వివరిస్తూ పాలమూరు ప్రజల కష్టాలను గత పాలకులు పట్టించుకోలేదని మండిపడ్డారు.
ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. “గడ్డం పెంచుకున్నంత మాత్రాన నాయకత్వ లక్షణాలు రావు.. పది జన్మలు ఎత్తినా నువ్వు రేవంత్ రెడ్డివి కాలేవు” అని ఎద్దేవా చేశారు. కొడంగల్‌కు నీళ్లు, పరిశ్రమలు వస్తుంటే విపక్షాలకు కడుపుమంట ఎందుకని ప్రశ్నించారు.
ఎవరు అడ్డుపడినా కొడంగల్‌లో రూ. 10 వేల కోట్ల అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని, 2028 డిసెంబరు నాటికి కృష్ణా జలాలను తీసుకొచ్చి పంట పొలాలకు అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే పాత్రికేయుల ఇళ్ల స్థలాల సమస్యను త్వరలోనే సుప్రీంకోర్టు తీర్పునకు లోబడి ఏదో ఒక మార్గంలో పరిష్కరిస్తానని సీఎం హామీ ఇచ్చారు.








































