మే 7, గురువారం నాడు కన్నెపల్లి పంప్ హౌస్ ను తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మరియు అధికారుల బృందం సందర్శించింది. మంత్రి ఈటల రాజేందర్ నేతృత్వంలో ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ రజత్ కుమార్, సీఎం కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్, ఇరిగేషన్ సలహాదారు పెంటారెడ్డి, ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్ లు కన్నెపల్లి (లక్ష్మి) పంపు హౌస్ ను సందర్శించి పంప్ హౌస్ నిర్మాణ పనులను పరిశీలించారు. హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ నుండి మంత్రులు మరియు అధికారుల బృందం కన్నెపల్లి చేరుకోగా హెలిప్యాడ్ వద్ద జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ మహ్మద్ అబ్దుల్ అజీం మరియు జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ లు స్వాగతం పలికారు.
అనంతరం కన్నెపల్లి పంప్ హౌస్ లో నిర్మాణంలో ఉన్న వివిధ మిషనరీల పనులను పరిశీలించగా, కాళేశ్వరం ప్రాజెక్టు ఇఎన్సి నల్లూ వెంకటేశ్వర్లు కన్నెపల్లి పంప్ హౌస్ నిర్మాణ పనులపై వివరించారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రానికే అన్నపూర్ణ లాంటిదని, నిర్ధేశిత లక్ష్యం మేరకు కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీటిని తరలించేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే పనులు చేపట్టడం జరిగింది. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో నిలిచిపోయిన పనులు మరియు మిషనరీలు రావడానికి ఇబ్బంది కలగడంతో పెండింగ్లో ఉన్న పనులను లాక్ డౌన్ ఎత్తి వేయగానే ప్రభుత్వ ఆదేశాల మేరకు పనులను వేగంగా చేపట్టి వానాకాలం పంట నాటికి పూర్తిస్థాయిలో నీటిని తరలించేలా అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు.
ఈ సందర్భంగా జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు సందర్భంగా కోత విధించకుండా అధికారులు పగడ్బందీగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ మహ్మద్ అబ్దుల్ అజీంను మంత్రి రాజేందర్ ఆదేశించారు. ఇప్పటికే అధికారులతో సమీక్షలు నిర్వహించి, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి వరి ధాన్యం కొనుగోలులో కోత లేకుండా చర్యలు చేపట్టామని కలెక్టర్ తెలిపారు. అదే విధంగా జిల్లాలో 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా వారిలో ఇద్దరికీ నయమై గాంధీ ఆస్పత్రి నుంచి తిరిగి వచ్చారని, ఒక్కరు గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారని, జిల్లాలో ఏర్పాటు చేసిన ఒక్క కంటైన్మెంట్ జోన్ ను కూడా తొలగించడం జరిగిందని, జిల్లాలో కరోనా వైరస్ వ్యాపించకుండా కట్టుదిట్టంగా చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్ మంత్రికి వివరించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu