తెలంగాణ రాష్ట్రంలో నగరాలు, పట్టణాలలో భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు సులభతరం చేస్తూ, 100 శాతం పారదర్శకతతో ఉండేలా రూపొందించిన టిఎస్ బీపాస్ వెబ్సైట్ను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ సోమవారం నాడు మర్రి చెన్నారెడ్డి మానవవనరుల సంస్థలో జరిగిన కార్యక్రమంలో అధికారికంగా ప్రారంభించారు. దీంతో నేటి నుంచే రాష్ట్రంలో టిఎస్ బీపాస్ అమల్లోకి రానుంది. టిఎస్ బీపాస్ సేవలను వెబ్సైట్, ప్రత్యేక మొబైల్ యాప్, మీ-సేవా కేంద్రాలు, మున్సిపాలిటీలు లేదా కలెక్టర్ ఆఫీసుల లోని పౌరసేవా కేంద్రాలు ద్వారా పొందవచ్చని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కేటిఆర్ మాట్లాడూతూ, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా పట్టణీకరణ వేగంగా జరుగుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే 43 శాతం జనాభా పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారని, వచ్చే 5 నుండి 7 సంవత్సరాల్లో తెలంగాణలో 51 శాతం జనాభా పట్టణాల్లో నివసించే అవకాశముందని చెప్పారు. ఈ నేపథ్యంలో అన్ని ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటుగా, అధికార వికేంద్రీకరణలో భాగంగా సీఎం కేసీఆర్ గత ఆరు సంవత్సరాల్లో ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిపారు. కొత్త జిల్లాలు, పంచాయితీలు, మండలాలు, రెవెన్యూ డివిజన్స్, మున్సిపాలిటీలు ఏర్పాటు చేసి అధికార యంత్రాగాన్ని ప్రజలకు మరింత చేరువ చేశారని చెప్పారు. ఈ క్రమంలో టిఎస్ ఐపాస్ తరహాలోనే టిఎస్ బీపాస్ పేరుతో ఒక అద్భుతమైన సంస్కరణను రాష్ట్రంలో ప్రవేశపెడుతున్నామని చెప్పారు.
త్వరలో నూతన జీహెఛ్ఎంసీ చట్టాన్ని తీసుకురాబోతున్నాం: మంత్రి కేటిఆర్
టిఎస్ బీపాస్ చట్టం ప్రకారం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ధ్రువీకరణలు, తప్పుడు ధ్రువీకరణ చేస్తే భవన నిర్మాణాలను ఎలాంటి నోటీసు లేకుండా కూల్చే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని చెప్పారు. పట్టణాలు పెరుగుతున్న మేరకు క్రమబద్ధీకరణ, ప్రణాళికాబద్ధ అభివృద్ధి జరగకపోవడంతో ఇటీవల వచ్చిన వరదల వల్ల ఏర్పడ్డ పరిస్థితులు పదేపదే వస్తున్నాయని అన్నారు. అందుకే నూతన జీహెఛ్ఎంసీ చట్టంలో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి కోసం కొన్ని కఠినమైన నిబంధనలను చేర్చబోతున్నామని మంత్రి కేటిఆర్ వెల్లడించారు. ఇప్పటికే కొత్తగా మున్సిపల్, పంచాయతీ రాజ్, రెవెన్యూ వంటి చట్టాలు తీసుకువచ్చామని, త్వరలో నూతన జీహెఛ్ఎంసీ చట్టాన్ని తీసుకురాబోతున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన టీఎస్-బీపాస్ విధానం దేశంలోనే అత్యుత్తమ భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియగా నిలువబోతున్నదని చెప్పారు. రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ నగరానికి ఉన్నంత ఉజ్వల భవిష్యత్తు ఏ ఇతర మెట్రో నగరానికి కూడా లేదని, టిఎస్-బీపాస్ ను విస్తృతంగా వినియోగించుకోవాలని ప్రజలకి,రియల్ ఎస్టేట్ వర్గాలకు మంత్రి కేటిఆర్ విజ్ఞప్తి చేశారు.
టిఎస్ బీపాస్ లోని ముఖ్యాంశాలు:
- 75 గజాల లోపు స్థలం ఉండి, 7 మీటర్ల ఎత్తుతో నిర్మించే నివాస భవనాలకు అనుమతి అవసరం లేదు.
- 75 నుంచి 600 గజాల వరకు స్థలం ఉండి, 10 మీటర్ల ఎత్తుతో నిర్మించే నివాస భవనాలకు తక్షణమే అనుమతి పొందవచ్చు.
- 600 గజాలకు పైగా స్థలంలో, 10 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తుకు 21 రోజుల్లోనే సింగిల్ విండో అనుమతి పొందవచ్చు.
- స్వీయ ధృవీకరణ ఆధారంగా ఆమోదాలు, పౌరుల బాధ్యత వహించాలి మరియు అనుమతుల్లో మానవ ప్రమేయం ఉండదు.
- అర్బన్ లోకల్ బాడీ/మున్సిపాలిటీలు 21 రోజుల్లో పర్మిషన్ ఇవ్వకపోతే 22వ రోజున డీమ్డ్ అఫ్రూవల్ ద్వారా దరఖాస్తు చేసుకున్న వ్యక్తికీ ఆన్లైన్లో అనుమతి లభిస్తుంది.
- మొదటిసారిగా పూర్తిస్థాయి ఆటోమేటెడ్ స్వీయ ధృవీకరణ వ్యవస్థ ఏర్పాటు.
- 21 రోజుల్లోనే అనుమతులు.
- సింగిల్ రూఫ్ కింద లైన్ డిపార్ట్మెంట్ ఎన్ఓసిలు జారీ.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ