రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లకు మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు, టీఎస్‌పీఎస్సీ వ్యవహారంలో తన పేరు లాగడంపై ఆగ్రహం

Minister KTR Sends Legal Notices to Revanth Reddy Bandi Sanjay over Dragging His Name in TSPSC Paper Leakage Issue,Minister KTR Sends Legal Notices To Revanth Reddy,Minister KTR Sends Legal Notice To Bandi Sanjay,Minister KTR over Dragging His Name in TSPSC,TSPSC Paper Leakage Issue,Mango News,Mango News Telugu,KTR issues legal notices to Revanth Reddy,KTR Latest News,TSPSC 2023 Paper Leak,TSPSC Paper Leak,TSPSC 2023 Latest News,TSPSC Latest Updates,Telangana TSPSC Live News,TSPSC Paper Leak News Updates

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) వ్యవహారంపై నిరాధారమైన, అసత్య ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్, బీజేపీ నేతలు రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లకు లీగల్ నోటీసులు పంపిస్తున్నట్టు మంత్రి కే.తారకరామారావు తెలిపారు. టీఎస్‌పీఎస్సీ వ్యవహారంలో కేవలం రాజకీయ దురుద్దేశంతోనే తన పేరును లాగుతూ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే కుట్ర చేస్తున్నందుకు వీరిద్దరికి లీగల్ నోటీసులు పంపుతున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు స్వయంప్రతిపత్తి ఉంటుందన్న విషయం కూడా అవగాహన లేకుండా ఈ అంశంలోకి ప్రభుత్వాన్ని, తనను లాగడం వారి అజ్ఞానానికి నిదర్శనమని మండిపడ్డారు. స్వతంత్రంగా పరీక్షల నిర్వహణ, ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వంతో సంబంధం లేకుండా పబ్లిక్ సర్వీస్ కమిషన్ వ్యవస్థ ఏర్పాటయిందని, అయితే ఈ వాస్తవాలు అన్నిటినీ పక్కనపెట్టి ఈ మొత్తం వ్యవహారం ప్రభుత్వ పరిధిలో జరుగుతున్న అంశంగా చిత్రీకరించే దుర్మార్గపూరిత కుట్రలకు బండి సంజయ్, రేవంత్ లు తెరలేపారని కేటీఆర్ అన్నారు. ఈ మేరకు కేటీఆర్ ఒక ప్రకటన విడుదల చేశారు.

ప్రభుత్వాల పరిపాలన వ్యవహారాల పట్ల కనీస ఇంగిత జ్ఞానం లేకుండా తెలివితక్కువతనంతో వీరు అవాకులు చెవాకులు పేలుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. బోడిగుండుకు మోకాలికి ముడిపెట్టినట్లు మాట్లాడుతూ టీఎస్‌పీఎస్సీ వ్యవహారంలో కుట్రపూరితంగా రాజకీయ దురుద్దేశంతోనే పదేపదే తన పేరును లాగేందుకు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. బట్ట కాల్చి మీదేసే ఇలాంటి చిల్లర ప్రయత్నాలను ఎట్టిపరిస్థితుల్లో సహించనని హెచ్చరించారు. ఇప్పటికే వీరు తమ తెలివి తక్కువ ప్రకటనలు, మతిలేని మాటలతో ప్రజల్లో చులకన అయ్యారని కేటీఆర్ గుర్తుచేశారు. గతంలో కోవిడ్ సందర్భంగా పదివేల కోట్ల వ్యాక్సీన్ కుంభకోణం జరిగిందని, తెలంగాణ సచివాలయం కింద వేల కోట్ల విలువచేసే నిజాం నగలున్నాయనే వ్యాఖ్యలు చేసి రేవంత్ రెడ్డి నవ్వులపాలయ్యారని అన్నారు. తెలివితక్కువ తనంలో రేవంత్ తో పోటీపడి శవాలు-శివాలు, బండి పోతే బండి ఫ్రీ అంటూ బండి సంజయ్ చేసిన అర్థరహిత వ్యాఖ్యలు కూడా ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. వీరి వ్యాఖ్యలు, వ్యవహారశైలిని గమనించిన తరువాత, వీరిద్దరు మానసిక సంతులనం కోల్పోయారని ప్రజలు భావిస్తున్నారన్నారు. వీరిద్దరి నాయకత్వంలో కాంగ్రెస్, బీజేపీల పరిస్థితి పిచ్చోడి చేతిలో రాయిలా మారిందన్నారు.

టీఎస్‌పీఎస్సీ అంశంలో కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న దుష్ప్రచారాల వెనక మొత్తం ఉద్యోగాల భర్తీ ప్రక్రియనే నిలిపివేయాలనే ఒక భయంకరమైన కుతంత్రం దాగి ఉందని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. గతంలో ఇదే నాయకులు ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడమే ఒక కుట్రగా అభివర్ణించారని, చదువులు పక్కన పెట్టి తమ రాజకీయాల కోసం యువత కలిసి రావాలని గతంలో చేసిన వ్యాఖ్యలు, వాళ్ల కుటిల మనస్థత్వానికి అద్దం పడుతున్నాయన్నారు. సంబంధం లేని మరణాలను కూడా ఈ వ్యవహారంతో అంటగట్టి, యువత ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా చేసిన వికృత ప్రయత్నాలు విఫలమైనా కూడా వీరికి బుద్ధిరాలేదన్నారు. ఇప్పటికైనా శవాలపైనే చిల్లర ఏరుకునే రాజకీయ రాబందుల మాదిరిగా కాంగ్రెస్, బీజేపీ మారాయని కేటీఆర్ మండిపడ్డారు.

ఉద్యోగాల ప్రిపరేషన్ ను కొనసాగించాలని యువతకు విజ్ఞప్తి:

తలా తోక లేకుండా మాట్లాడుతున్న ఈ రెండు పార్టీల నేతల పిచ్చిమాటలు ఉచ్చులో పడకుండా యువత తమ పోటీ పరీక్షల సన్నద్ధతపైనే దృష్టి సారించాలని ఈ సందర్భంగా రాష్ట్ర యువతకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. టీఎస్‌పీఎస్సీ ఇప్పటికే దిద్దుబాటు చర్యలను ప్రారంభించిందని భవిష్యత్తులో నిర్వహించబోయే పరీక్షలను మరింత కట్టుదిట్టంగా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిర్వహించేందుకు సన్నద్ధమవుతుందని తెలిపారు. కేవలం రాజకీయాల కోసం జరుగుతున్న దుర్మార్గపూరిత కుట్రలను, ప్రచారాన్ని నమ్మువద్దని మంత్రి కేటీఆర్ విజ్ఞప్తిచేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here