సీఎం దళిత సాధికారత పథకం: పేద దళిత కుటుంబాల ఖాతాల్లో నేరుగా రూ 10 లక్షలు జమ

Chief Minister’s Dalit Empowerment Scheme, CM Dalit Empowerment, CM Dalit Empowerment Scheme, CM KCR about Dalit Empowerment Plan, Dalit Empowerment Plan, death of a dalit woman in Telangana, Mango News, Telangana CM Dalit Empowerment Scheme, Telangana CM Dalit Empowerment Scheme 2021, Telangana Govt Announced 10 Lakh to Each Dalit Beneficiaries, Telangana Govt Announced 10 Lakh to Each Dalit Beneficiaries Under Dalit Empowerment Scheme

స్వీయ ఆర్థిక సాధికారత కోసం దళితుల స్వయం నిర్ణయాధికారాన్ని గౌరవిస్తూ, అర్హులైన ఎంపిక చేయబడిన లబ్ది దారులకు, సీఎం దళిత సాధికారత పథకం ద్వారా ఒక కుటుంబం ఒక యూనిట్ గా, యూనిట్ ఒక్కంటికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని నేరుగా వారి వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయడం ద్వారా అందజేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశం సమిష్టి నిర్ణయం తీసుకుంది. మొదటి దశలో 119 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి నియోజకవర్గానికి 100 కుటుంబాల చొప్పున, రాష్ట్రవ్యాప్తంగా 11,900 ఎంపిక చేయబడిన అర్హులైన దళిత కుటుంబాలకు ఈ ఆర్థిక సాయం అందుతుంది. ఇందుకు గాను 1200 కోట్లతో “సీఎం దళిత సాధికారత పథకం” ప్రారంభం చేయాలని, ఎంపిక చేయబడిన బాటమ్ లైన్ లో వున్న కడుపేద దళిత కుటుంబానికి (రైతు బంధు పథకం మాదిరి) నేరుగా అందచేయాలని అఖిలపక్షం నిర్ణయించింది.

దళితుల జీవితాల్లో గుణాత్మక మార్పుకు దోహదం: 

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుపరచబోతున్న ‘సీఎం దళిత సాధికారత పథకం’ దళితుల జీవితాల్లో గుణాత్మక మార్పుకు దోహదం చేయనున్నదనీ, దళిత జనోద్ధరణకు సీఎం ఆలోచనలు, ఇప్పటికే అమలుపరుస్తున్న కార్యాచరణ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయనీ, దళిత సాధికారత పథకంతో మరింత గొప్పగా దళితుల జీవితాలు మారుతాయనీ అఖిలపక్ష సమావేశం అభిప్రాయపడింది. తెలంగాణ సమాజం మొత్తంగా దళిత సమాజం వెన్నుదన్నుగా నిలబడి దళితుల ఆత్మన్యూనతను పోగొట్టి, ఆత్మస్థైర్యాన్ని పెంచి, వారి ఆలోచనా దృక్పథంలో గుణాత్మక మార్పులకు దోహదపడాలనీ, అందులో భాగస్వామ్యం పంచుకోవాలనే సదుద్దేశంతో అన్ని పార్టీలను పిలిచి, రాజకీయాలకు అతీతంగా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశామని సీఎం కేసీఆర్ అన్నారు.

ఆదివారం ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ‘సీఎం దళిత సాధికారత పథకం’ విధివిధానాల ఖరారు అంశంపై దళిత ప్రజాప్రతినిధులతో అఖిలపక్ష సమావేశం జరిగింది. 11 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన సమావేశంలో పలు పార్టీలకు చెందిన పలువురు దళిత ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేధావులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. దళితుల సంక్షేమం, అభివృద్ధి కోసం సీఎం తపనను ఈ సందర్భంగా వక్తలు ముక్తకంఠంతో అభినందించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ “దళితులు సామాజిక, ఆర్థిక వివక్షకు గురవడం భారత సమాజానికే కళంకం. ఇది మనసున్న ప్రతీ ఒక్కరినీ కలచి వేసే విషయం. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం దళితుల సంక్షేమం, అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలను ప్రవేశపెడుతున్నది. విద్య, వ్యవసాయం సహా పలు రంగాల్లో గుణాత్మక అభివృద్ధిని సాధిస్తున్నది. ఐనా ఇంకా దారిద్ర్యరేఖకు దిగువన, బాటమ్ లైన్లో విస్మరించబడిన దళిత కుటుంబాలను గుర్తించి వారిని అభివృద్ధి పథాన నడిపించడమే ప్రధాన ధ్యేయంగా 1200 కోట్ల రూపాయలతో ‘సీఎం దళిత సాధికారత పథకం’ ప్రవేశపెడుతున్నాం” అని స్పష్టం చేశారు.

సమాజాన్ని ముందుకు నడిపించడంలో ప్రభుత్వాలది చంటి పిల్లలను పెంచి పోషించే పాత్ర అనీ, నిర్లక్ష్యం వహిస్తే రేపటి తరాలు నష్టపోతాయనీ, అందుకు బాధ్యులు పాలకులే అవుతారని సీఎం అన్నారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఏ ఊరుకు పోయినా సామాజికంగా, ఆర్థికంగా పీడిత వర్గాలు ఎవరంటే చెప్పే పేరు దళితులేనని ఆయన అన్నారు. ఈ బాధలు పోవాలని సీఎం ఆకాంక్షించారు. “దళితులకు సామాజిక, ఆర్థిక బాధలు తొలిగిపోవాలంటే ఏం చేయాలో దశలవారీగా కార్యాచరణ అమలు పరచడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. “మేము కూడా ముందుకు పోగలం” అనే ఆత్మస్థైర్యంతో దళిత సమాజం ముందుకు పోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఏమి చేయాలో అఖిలపక్షం సూచనలు చేయాలి. దళిత సాధికారతకు పైరవీలకు ఆస్కారం లేని పారదర్శక విధానాన్ని అమలుపరుద్దాం. నిధుల బాధ్యత నాది. పార్టీలు రాజకీయలకు అతీతంగా సమిష్టి కార్యాచరణ చేపట్టే బాధ్యత మనమందరం తీసుకుందాం” అని సీఎం అఖిలపక్షానికి సూచించారు.

“రాష్ట్రంలో 7,79,902 మంది ఎస్సీ రైతుల వద్ద 13,58,000 ఎకరాలు వ్యవసాయ భూమి ఉంది. స్థిరత్వం సాధించిన ఎస్సీ కుటుంబాలకు ఇతరత్రా చేయూతనిస్తూనే, స్థిరత్వం సాధించని, రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాలను మొట్టమొదటగా ఆదుకునే కార్యాచరణ చేపట్టాలి. ఎస్సీ రైతుల వద్ద ఉన్న 13,58,000 ఎకరాల్లో అసైన్డ్ ల్యాండ్స్ ఎన్ని ఎకరాలున్నాయి? ఇందులో ఉన్నదెంత? పోయిందెంత? లెక్కలు తీయాలి. దీన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాలి. ఎస్సీ భూముల్లో నీళ్ళు లేని, నీళ్ళు ఉండి ఇతర వసతులు లేని భూములు కలిగి ఉన్న కుటుంబాలను గుర్తించాలి. తెలంగాణ దళిత సమాజం వద్దనున్న వ్యవసాయ భూమిని గణన చేయాలి. లెక్కలను స్థిరీకరించి ఒక సమగ్ర అవగాహనకు రావాలి. రాష్ట్రమంతా అవసరమైతే పది పదిహేను రోజులు భూముల లెక్కల మీదనే ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలి. సామాజికంగా, ఆర్థికంగా చేపట్టాల్సిన కార్యాచరణను దేనికదే సిద్ధం చేసుకోవాలి. రాబోయే మూడు నాలుగేండ్లలో 35 నుంచి 40 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధం గా వుంది. ఇందుకు సంబందించిన సమిష్టి కార్యాచరణ అందరం కలిసి చేపట్టాలి’’ అని సీఎం స్పష్టం చేశారు.

రైతు బంధు పథకం, ఆసరా పెన్షన్ల మాదిరి నేరుగా లబ్దిదారులక ఆర్థిక సాయం:

కాళేశ్వరం వంటి సాగునీటి ప్రాజెక్టుల ద్వారా వ్యవసాయం అభివ్రుద్ది చెందడంతో తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో భూమిమీద ఆధారపడి జీవనోపాధి రోజు రోజుకు పెరుగుతున్నదని సీఎం అన్నారు. పట్టణాల్లో మారిన పరిస్థితుల్లో పారిశ్రామిక, సాంకేతిక తదితర రంగాల్లో దళిత యువత స్వయం ఉపాధి కోసం అన్వేషించాలని సూచించారు. గోరేటి వెంకన్న ‘గల్లీ చిన్నది..’ పాట ను మనసు పెట్టీ వింటే దళితుల సమస్యకు పరిష్కారాలు దొరుకుతాయని సీఎం అన్నారు. గ్రామీణ, పట్టణ దళితుల సమస్యలను విడి విడి గా గుర్తించి పరిష్కారాలు వెతకాలనీ, దళితుల సామాజిక ఆర్థిక సమస్యలను గుర్తించి సమిష్టి కృషితో సమాధానాలు సాధించాలని సీఎం సూచించారు. దళితుల అభ్యున్నతికి సీఎం దళిత్ ఎంపవర్ మెంట్ పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలనుకుంటున్నామని సీఎం స్పష్టం చేశారు.
రైతు బంధు పథకం, ఆసరా పెన్షన్ల మాదిరి నేరుగా లబ్దిదారులక ఆర్థిక సాయం అందే విధంగా అత్యంత పారదర్శకంగా, మధ్య దళారీలు లేని విధానం కోసం సూచనలు సలహాలు ఇవ్వాలని అఖిల పక్ష సమావేశంలో పాల్గొన్న నాయకులను సీఎం కోరారు. దళితుల్లో అర్హులైన కుటుంబాల గణన జరపాలన్నారు. అట్టడుగున వున్న వారి నుంచి సహాయం ప్రారంభించి, వారి అభ్యున్నతిని సాంకేతిక విధానం ద్వారా నిత్యం పర్యవేక్షించేలా కార్యాచరణ రూపొందించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నదని సీఎం తెలిపారు.

సీఎం దళిత్ ఎంపవర్ మెంట్ పథకానికి రూ.1200 కోట్లు:

“ఈ బడ్జెట్ లో సీఎం దళిత్ ఎంపవర్ మెంట్ పథకానికి రూ.1200 కోట్లు కేటాయించాం. రాబోయే మూడు నాలుగేండ్లలో 35 నుంచి 40 వేల కోట్ల రూపాయలు ఖర్చుచేయాలని ప్రభుత్వం యోచిస్తున్నది. ఈ కేటాయింపులు ఎస్సీ సబ్ ప్లాన్ కు అదనం. దళిత సాధికారతను సాధించడానికి ప్రభుత్వం మిషన్ మోడ్ లో పనిచేయడానికి నిశ్చయించుకున్నది. మీరందరూ కలిసి రావాలి. నాకు భగవంతుడిచ్చిన సర్వ శక్తులన్నీ ఉపయోగించి, సీఎం దళిత సాధికారత పథకాన్ని సంపూర్ణంగా విజయవంతం చేయాలనేదే నా దృఢ సంకల్పం” అని అఖిలపక్షాన్ని ఉద్దేశించి సీఎం అన్నారు. సీఎం సఫాయి కార్మికులపై తనుకున్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. “సఫాయన్న నీకు సలాం అన్న” అనే నినాదం నాది. సఫాయి కార్మికులు తల్లిదండ్రుల కన్నా ఎక్కువ. ఎవరూ డిమాండ్ చేయకున్నా ప్రతీసారీ వాళ్ళ జీతాలు పెంచుకుంటూ వస్తున్నాం. సఫాయి కార్మికులకు ఉద్యోగ భద్రతతో కూడిన నిర్మాణాత్మక జీతభత్యాల రూపకల్పన విధానం (పీఆర్సీ తరహాలో) అమలుకు చర్యలు తీసుకుంటామని అఖిల పక్షంలో వచ్చిన అభ్యర్ధన మేరకు సీఎం తెలిపారు. ప్రైవేట్ రంగంలో దళితులకు రిజర్వేషన్ల అమలు అంశం సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని కూడా ఇదే సందర్భంలో సీఎం అన్నారు. “అద్దాల అంగడి మాయా లోకం మోపైంది. ఈ పోటీ ప్రపంచం, కరోనా నేపథ్యంలో దళిత బిడ్డలు నైపుణ్యాలను పెంచుకోవాలి. ఎటువంటి బ్యాంకు గ్యారంటీల జంఝాటం లేకుండానే సీఎం దళిత సాధికారత పథకం ద్వారా కడునిరుపేద దళిత కుటుంబాలకు సహకారం అందిస్తాం” అని సీఎం హామీ ఇచ్చారు.

‘సెంటర్ ఫర్ దలిత్ స్టడీస్’ అనుసరించిన విధానాన్ని ఎస్సీ సంక్షేమ శాఖ అనుసరిస్తూ, దళితుల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసుకొని, కమిట్ మెంట్ వున్న అధికారులను నియమించుకోవాలని సూచించారు. “దళిత సాధికారత కోసం, దళిత సమాజాన్ని అన్ని రంగాల్లో అవకాశాలను అందుకునే దిశగా, చైతన్యం చేయాలి. ఆ దిశగా సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టాలి. పాటలు, కళా రూపాల ప్రదర్శన, ఎలక్ట్రానిక్ మీడియా, సామాజిక మాధ్యమాల ద్వారా చైతన్య కార్యక్రమాలను రూపొందించాలి. దళితుల చైతన్యం కోసం గోరేటి వెంకన్న వంటి కవులను, సాంస్కృతిక సారథి, తదితర కళాకారుల సేవలను వినియోగించుకోవాలి. దళిత యువత ఆలోచనా దృక్పథంలో గుణాత్మక మార్పుకు, ఆత్మ న్యూనత నుంచి ఆత్మ స్థైర్యం పెరిగి, ఉన్నత స్థాయి ఓరియంటేషన్ అలవర్చుకునే దిశగా చర్యలు చేపట్టాలి” అని సీఎం అధికారులను ఆదేశించారు. దళిత విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న, ఓవర్ సీస్ ఎడ్యుకేషన్ స్కాలర్ షిప్ పొందేందుకు ప్రస్తుతం అమల్లో ఉన్న ఇన్ కమ్ సీలింగ్ లో సడలింపు అంశాన్ని పరిశీలిస్తామని సీఎం తెలిపారు.

వ్యవసాయం సాగునీటి రంగాలను చక్కదిద్ది, ఇరిగేషన్ రంగాన్ని పట్టుబట్టి గాడిలో పెట్టినట్టు, దళితుల సాధికారత కోసం కూడా ప్రభుత్వం అంతే పట్టుదలతో పని చేయాలని నిర్ణయించిందని సీఎం తెలిపారు. వ్యాపార నిర్వహణ కోసం, తదితర స్వయం ఉపాధి రంగాల ఏర్పాటు కోసం, ప్రభుత్వం మంజూరు చేసే లైసెన్స్ లు, అందించే పెట్టుబడులు, మొదలైన అంశాల్లో అర్హులైన దళిత యువతకు రిజర్వేషన్స్ కోటా అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అఖిలపక్షంలో పాల్గొన్న పలు పార్టీల నేతలు సీఎం దళిత సాధికారత అంశాన్ని ప్రశంసిస్తూ మాట్లాడారు. దళిత సాధికారత కోసం, సీఎం కేసీఆర్ తీసుకున్న చొరవ, దృఢ నిశ్చయం సంతోషాన్ని కలిగిస్తున్నదని, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మరియమ్మ లాకప్ డెత్ కేసులో, వారి కుటుంబానికి సహాయం చేస్తూ, సీఎం తక్షణ స్పందన, తీసుకున్న నిర్ణయాలు, దళిత సమాజంలో ఆత్మస్థైర్యాన్ని పెంచిందన్నారు. దళిత సాధికారత కోసం, ప్రభుత్వ నిర్ణయాలను అధికారులు చిత్త శుద్ధితో అమలుపరచాలని, ప్రభుత్వానికి తమ పార్టీ తరఫున సంపూర్ణ సహకారం వుంటుందని తమ్మినేని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా సీపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ “దళిత సాధికారత కోసం సీఎం స్వయంగా ముందుకు రావడం, అటువంటి ఆలోచన చేయడం సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్ 2003లోనే దళిత సాధికారంత కోసం సమావేశం ఏర్పాటు చేసి అనేక అంశాలను చర్చించడం నాకు గుర్తున్నది. ప్రభుత్వం అమలుపరుస్తున్న కళ్యాణ లక్ష్మి వంటి పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలు దళితులకు భరోసానిస్తున్నాయి” అని అన్నారు. మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ దళితుల అభ్యున్నతికి పాటుపడుతున్న సీఎం పై ప్రశంసల వర్షం కురిపించారు. రిజర్వేషన్లు పెట్టి దళితులను ఆదుకున్న మహనీయుడు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో ప్రజల హృదయాల్లో శాశ్వతంగా ఉండే అవకాశాన్ని సీఎం సద్వినియోగం చేసుకోవడం సంతోషంగా ఉందని మోత్కుపల్లి అన్నారు. అఖిలపక్షాన్ని పిలిచి మా ఆత్మగౌరవాన్ని గుర్తించి ఆనందం కలిగించినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. మరియమ్మ విషయంలో తీసుకున్న రక్షణ చర్యలు దళిత వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయనీ, దళితుల్లో సీఎం మీద విశ్వాసం పెరిగిందని సీఎంను అభినందించారు. దళితుల కోసం ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయడాన్ని హృదయపూర్వకంగా అభినందించారు. యాదగిరిగుట్టను ప్రపంచం గుర్తించే రీతిలో తీర్చిదిద్దుతున్నందుకు, అక్కడి నుంచి ఐదు సార్లు గెలిచిన ప్రజాప్రతినిధిగా సీఎంకు మోత్కుపల్లి కృతజ్ఞతలు తెలిపారు. రైతుబంధు పథకం లాగా దళారీలు లేకుండా నేరుగా ఆర్థిక సహాయం అందించడం వల్ల దళితులు సంతోషిస్తారన్నారు. గురుకుల పాఠశాలలు వచ్చిన తర్వాత దళిత విద్యార్థులు ఉన్నత ఉద్యోగాలు సాధించటం, వారి ఆకాంక్షలు నెరవేరుతుండటం అంతులేని ఆనందాన్నిస్తోందని మోత్కుపల్లి ఉద్వేగానికి లోనయ్యారు. ఎస్సీల గురించి ఇంతగా తపించే మీకు భగవంతుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుందని సీఎంను ఉద్దేశించి అన్నారు.

దళితుల అభివృద్ధికి నిర్వారామ కృషి చేస్తున్న సీఎం ఆధ్వర్యంలోని ప్రభుత్వ యంత్రాగంపై కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క విశ్వాసం వ్యక్తం చేశారు. “దళితుల కోసం తెచ్చిన స్కీమ్ లను పటిష్టంగా అమలు చేయడానికి ప్రభుత్వ యంత్రాంగం పటిష్టంగా వుండడం అవసరం. సీఎం నిర్ణయాన్ని అధికారులు పటిష్టంగా అమలు చేస్తారనే విశ్వాసం మాకుంది” అని ఆశాభావం వ్యక్తం చేశారు. మరియమ్మ విషయంలో దళిత సమాజానికి ఒక భరోసాను, ధైర్యాన్ని సీఎం కేసీఆర్ అందించారని భట్టి అన్నారు. పోలీసుల ప్రవర్తనలో ఇకనైనా మార్పు రావాలని అన్నారు. ఎస్సీ బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేయాలని సీఎంను కోరారు. దళిత సాధికారత పథకం ద్వారా, నేరుగా ఆర్థిక సాయం అందిస్తే దళితులు వారి అభివృద్ధిని వారే నిర్ణయించుకోగలుగుతారని ఆయన అన్నారు. అసైన్డ్ భూములను వెనక్కు తీసుకోవడం కంటే, భూమి విలువను నిర్ధారించి, ఆమేరకు కంపెనీల్లో రైతులకు షేర్ల ద్వారా వాటా ఇవ్వాలి సూచించారు.

ప్రభుత్వం కులాంతర వివాహాలను ప్రోత్సహించటంతో పాటు, దళితుల మీద దాడులు జరిగితే సహించమనే రీతిలో కార్యాచరణ చేపట్టి, దళితుల్లో మరింతగా ధైర్యం నింపాలని అఖిలపక్ష భేటిలో కమ్యూనిస్టు పార్టీ నేతలు ముఖ్యమంత్రిని కోరారు. అదే విధంగా తెలంగాణ వచ్చిన తర్వాత అఘాయిత్యాలకు గురైన దళిత కుటుంబాలను గుర్తించి, వారికి రక్షణ చర్యలు ప్రకటించాలని సీఎంను దళిత సంఘాల నేతలు కోరారు. దళితుల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్యాచరణను ప్రశంసిస్తూ సీపిఎం నేత వెంకట్ పలు సూచనలు చేశారు. దళితులకు భూమికి బదులు భూమినే ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ గురుకులాలు ప్రైవేట్ స్కూల్స్ కంటే బాగున్నాయని అన్నారు. దళిత విద్యార్థులకు స్వయం ఉపాధి కల్పించేందుకు స్కిల్ డెవలప్ మెంట్ కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. దళితులందరికీ నివాస ప్రాంతాల్లో డబుల్ బెడ్ రూం ఇళ్ళు నిర్మించి ఇవ్వటంతో పాటు, దళిత కాలనీల్లో అభివృద్ధి కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల అభిప్రాయాలను సీఎం పేరు పేరునా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సామాజిక రాజకీయ ఆర్థిక సాంసృతిక రంగాల్లో దళితుల అభివృద్ధి కోసం వారు విలువైన సూచనలు చేశారు. వాటిని అధికారులు సీఎం ఆదేశాల మేరకు నోట్ చేసుకున్నారు. దళితుల సాధికారత కోసం సీఎం తీసుకున్న చారిత్రక నిర్ణయాన్ని వారు ముక్త కంఠంతో అభినందించారు. సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − four =