ఏపీలో మరో కొత్త వివాదం సంచలనంగా మారింది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీపై డెక్కన్ క్రానికల్ పత్రిక రాసిన వార్త ఇప్పుడు కాక రేపుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య చిచ్చు రాజేసింది. విశాఖలోని ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు కూటమి ప్రభుత్వం అంగీకారం తెలిపిందని ఆ పత్రిక వార్త ప్రచురించింది. ఇటీవల చంద్రబాబు నాయుడ ఢిల్లీకి వెళ్లినప్పుడు కేంద్ర పెద్దలతో దీనిపై చర్చలు జరిపారని.. వారికి కూడా ప్రైవేటీకరణపై మాట ఇచ్చారని వార్తలో పేర్కొంది. అయితే ఆ వార్త చూసిన తెలుగు తమ్ముళ్లు ఆగ్రహానికి గురయ్యారు. ఈ మేరకు పెద్ద ఎత్తున తెలుగు దేశం కార్యకర్తల విశాఖలోని డెక్కన్ క్రానికల్ ఆఫీస్ ఎదుట ఆందోళనకు దిగారు. అంతేకాకుండా ఆఫీస్ ఎదుట ఉన్న కంపెనీ బోర్డుకు నిప్పు పెట్టి అంటుపెట్టారు. ప్రస్తుతం ఈ అంశం వివాదాస్పదంగా మారింది.
మీడియా ఆఫీస్ బోర్డుకు టీడీపీ కార్యకర్తలు నిప్పు పెట్టడంపై ప్రతిపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీడియా సంస్థలపై దాడి చేసి.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల కాలంలో ఏ అంశంపై స్పందించని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. ఈ అంశంపై తీవ్ర స్థాయిలో స్పందించారు. అధికారపక్షంపై మండిపడ్డారు. తెలుగు దేశం పార్టీ పిరికితనంతో డెక్కన్ క్రానికల్ ఆఫీసుపై దాడి చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిష్పక్షపాతంతో పనిచేసే మీడియాను అణచివేస్తున్నారని.. ఈ ఘటనను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే ఇది యావత్ మీడియాపై జరిగిన దాడిగా జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు.
అయితే జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అటు తెలుగు దేశం పార్టీ కూడా గట్టిగానే రెస్పాండ్ అయింది. మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ జగన్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇది చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న మంచిని దాచేందుకు చేస్తున్న కుట్ర అని… డెక్కన్ క్రానికల్ రాసిన వార్త పెయిడ్ ఆర్టికల్ అని లోకేష్ పేర్కొన్నారు. ఇది ప్రభుత్వ పనితీరుపై జరుగుతున్న సానుకూల చర్చను దారి మళ్లీంచేందుకు చేసిన కుట్ర అని వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రోద్బలంతో ప్రచురించిన స్వచ్ఛమైన పెయిడ్ ఆర్టికల్ అని మండిపడ్డారు. అలాగే డెక్కన్ క్రానికల్ ఆఫీస్ ఎదుట ఉన్న బోర్డుకు టీడీపీ కార్యకర్తలు నిప్పు పెట్టడాన్ని తాను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సంయమనంతో ఉండాలన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఎన్నికలకు ముందు తాము ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నట్లు నారా లోకేష్ స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE