దాదాపు లక్ష కోట్ల నిధులతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందంటూ..దీనిపై తగిన విచారణ జరపాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టులో దాఖలైన రివిజన్ పిటిషన్పై.. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్కు సోమవారం మరో నోటీసు అందింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో గల వైఫల్యాలపై విచారణకు హాజరు కావాల్సిందిగా భూపాలపల్లి జిల్లా కోర్టు నోటీసులు జారీ చేసింది.సెప్టెంబర్ 5న విచారణకు రావాలంటూ కేసీఆర్కు పంపిన నోటీసుల్లో పేర్కొంది. కేసీఆర్తో పాటు హరీశ్ రావు సహా మొత్తం 8 మందికి న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది.
లక్ష కోట్ల రూపాయలు వ్యయం చేసి మరీ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు ఆనాటి కేసీఆర్ సర్కారే కారణమని రాజలింగమూర్తి అనే వ్యక్తి భూపాలపల్లి ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. కేసీఆర్ చేపట్టిన మేడిగడ్డ ప్రాజెక్టు వల్ల భారీగా ప్రజా ధనం దుర్వినియోగం అయిందని, అంతేకాకుండా కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్యమే దెబ్బతిందని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే దీనిపై సమగ్ర విచారణ జరపాలంటూ కోర్టుకు విన్నవించారు.
ప్రాజెక్టు వ్యయాన్ని పెద్ద ఎత్తున పెంచి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని రాజలింగమూర్తి తన పిటిషన్లో పేర్కొన్నారు . నిర్మాణంలో ఎక్కడా నాణ్యతా ప్రమాణాలు పాటించలేదని..దీనితో పాటు మేడిగడ్డ నిర్మాణానికి సంబంధించిన పలు టెక్నికల్ అంశాలను డ్యామ్ సేఫ్టీ అథారిటీ కోరినా కూడా అప్పటి కేసీఆర్ గవర్నమెంట్ ఇవ్వకుండా లోపాలను దాచే ప్రయత్నం చేసిందని పిటిషనర్ మెన్షన్ చేశారు.
గతేడాది అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీ కుంగిన విషయం తెలిసిందే. దీనిపై అక్టోబర్ 25న జయశంకర్ భూపాలపల్లికి చెందిన నాగవెళ్లి రాజలింగమూర్తి అనే వ్యక్తి లోకల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ బ్యారేజీ కుంగిన ఘటనపై తగిన విచారణ జరిపి మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావు, కాంట్రాక్టు.. నిర్మాణ సంస్థ, ఇంజినీరింగ్ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన తన ఫిర్యాదులో కోరారు. కానీ ఈ ఫిర్యాదును పోలీసులు ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదు సరికదా.. ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయకుండా వదిలేశారు.