వినేష్ ఫోగట్ స్వర్ణ పతకం సాధించాలన్న కల చెదిరిన తరువాత రెజ్లింగ్ విభాగంలో భారత్‌కు తొలి పతకం వచ్చింది. భారత ఆటగాడు అమన్ సెహ్రావత్ అద్భుత ప్రదర్శన చేసి ఒలింపిక్స్‌లో తొలి కాంస్య పతకాన్ని సాధించాడు. శుక్రవారం జరిగిన కాంస్య పతక పోరులో అమన్ సెహ్రావత్ 13-5తో ప్యూర్టోరికోకు చెందిన డారియన్ క్రూజ్‌పై విజయం సాధించాడు. ప్రస్తుత ఎడిషన్‌లో భారత్‌కు తొలి పతకాన్ని అందించిన రెజ్లర్ గా అమన్ సెహ్రావత్ నిలిచాడు.
గురువారం జరిగిన సెమీ ఫైనల్ పోరులో ఓడి నిరాశపరిచిన 21 ఏళ్ల అమన్ సెహ్రావత్ ఫైనల్‌కు అర్హత సాధించడంలో విఫలమయ్యాడు. దీంతో అతను కాంస్య పతకంతో సరిపెట్టుకున్నాడు. అందుకు తగ్గట్టుగానే శుక్రవారం రాత్రి జరిగిన 57 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో అమన్ సెహ్రావత్ అద్భుత ప్రదర్శన చేశాడు. ఆరు నిమిషాల పాటు జరిగిన కాంస్య పతక పోరులో అమన్ సెహ్రావత్ తన ప్రత్యర్థి డారియన్ క్రూజ్‌పై మొదటి నుంచి ఆధిపత్యం చెలాయించాడు. చివరికి 13-5 స్కోరుతో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు.
మ్యాచ్ చివరి రెండు నిమిషాల్లో అమన్ సెహ్రావత్ ప్యూర్టో రికన్ రెజ్లర్‌పై 8-5 ఆధిక్యంలోకి వెళ్లాడు. కాస్త విరామం తీసుకున్నాక… మరింత జోష్ తో ఆటను కొనసాగించాడు. చివరి నిమిషంలో అమన్ 12-5తో ఆధిక్యంలోకి వెళ్లాడు. సమయం ముగియడంతో అమన్ 13 పాయింట్లతో గేమ్‌ను గెలుచుకున్నాడు. దీంతో 14వ రోజు భారత్‌కు ఆరో పతకం లభించింది. 14వ రోజు ముగిసే సరికి భారత్ మొత్తం ఆరు పతకాలు సాధించింది. ఒక రజతం, ఐదు కాంస్య పతకాలు. రవికుమార్ దహియా గత టోక్యో ఒలింపిక్స్‌లో ఇదే విభాగంలో భారత్‌కు రజత పతకాన్ని అందించాడు. నేషనల్ సెలక్షన్ ట్రయల్స్‌లో రవికుమార్ దహియాను ఓడించి అమన్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. అంతకుముందు, క్వార్టర్ ఫైనల్స్‌లో అల్బేనియాకు చెందిన జెలింఖాన్ అబాకరోవ్‌పై సాంకేతిక ఆధిక్యత (12-0) ఆధారంగా సెమీ-ఫైనల్‌కు చేరుకోవడం ద్వారా అమన్ సెహ్రావత్ పతకం ఖాయం చేసుకున్నాడు.