కాకరకాయ పరమౌషధం..

Nutrients In Bittergourd Are Good For Health, Nutrients In Bittergourd, Bittergourd Are Good For Health, Benefits of Bittergourd, Health Benefits Bitter Gourd, Benefits of Bitter Melon, Bittergourd For Kidneys, Bitter Gourd Vitamins, Bittergourd, Kakarakaya, Health News, Health Tips, Healthy Food, Healthy Diet, Fitness, Mango News, Mango News Telugu

ఆకుపచ్చని రంగులో గరుకుతొక్కతో ఉండే కాకర మహా చేదుగా ఉంటుంది. అయితే సరిగ్గా వండితే కాకరకన్నా రుచికరమైన కూరగాయ మరొకటి ఉండదంటారు దాన్ని ఇష్టపడేవారు. కాకరతో వేపుడు, పులుసు వంటి కూరలే కాదు, ఈ కాయల్ని ఎండబెట్టి కారప్పొడీ చేస్తారు. నిల్వ పచ్చడి పడతారు. చిప్స్‌లా వేయిస్తారు. వడియాలు పడతారు. ఉల్లి, కొబ్బరి, పప్పులపొడులు కలిపిన మిశ్రమాన్ని కాయల్లో స్టఫ్‌ చేసి వండితే ఆ రుచే వేరప్పా అంటారు కాకరకాయ ప్రియులు.

కాకరకాయ శరీరానికి మంచిది. బ్రకోలీతో పోలిస్తే బీటా కెరోటిన్ రెండింతలు ఎక్కువగా ఉంటుంది. కాకరలోని విటమిన్ ఎ శరీరానికి తగిన శక్తినిస్తుంది. కాకరలోని కాల్షియం దంతాలకు బలాన్ని చేకూరుస్తుంది. ఇందులో పొటాషియం నరాల వ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది.

పొట్టకు సంబంధించిన అనేక సమస్యలకు ఇందులోని చేదు గుణం మందులా పనిచేస్తుంది. వంద గ్రా. కాకరలో 19 క్యాలరీలూ; 3.5 గ్రా.కార్బొహైడ్రేట్లూ; 2.4 గ్రా. పీచూ; 150 మి.గ్రా. కొవ్వులూ; 87 శాతం నీరూ; ఎ, సి, ఇ, బి1, బి2, బి3, బి9 విటమిన్లూ; పొటాషియం, కాల్షియం, జింక్‌, మెగ్నీషియం, ఫాస్ఫరస్‌, ఐరన్‌… వంటి ఖనిజాలూ పుష్కలంగా ఉంటాయి.ఓ కప్పు తాజా ముక్కలనుంచి రోజువారీ అవసరమయ్యే సి-విటమిన్‌లో 93 శాతం లభిస్తుంది.

డయాబెటిస్ వ్యాధికి కాకరకాయ మహత్తరమైన ఔషధం. దెబ్బతిన్న బీటాసెల్స్‌ని బాగుచేయడంతోపాటు ఇన్సులిన్‌ ఉత్పత్తిని పెంచే గుణాలు మెండుగా ఉంటాయి. కాకర కాయలూ, గింజల్లో ఉండే ఎమ్ఆర్‌కె-29 అనే ప్రొటీన్‌ సైతం రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గిస్తుందట. అందుకే రెండు టేబుల్‌స్పూన్ల చొప్పన తాజా కాకరకాయ రసాన్ని తీసుకుంటే మధుమేహం అదుపులో ఉంటుంది. ఇది రక్తశుద్ధికీ తోడ్పడుతుంది.

కాకరలోని మోమోర్డిసిన్‌ యాంటీవైరల్‌ గుణాన్ని కలిగి ఉంటుంది. వర్షాల్లో వచ్చే జలుబూ, దగ్గూ, జ్వరాల్ని ఇది అడ్డుకుంటుందనీ హెచ్ఐవీ, ఇతర ఇన్ఫెక్షన్లనీ నివారించ గలదనీ పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.

కాకర క్యాన్సర్‌కీ మంచిదే. దీన్నుంచి తీసిన ఎక్స్‌ట్రాక్ట్‌ లింఫాయిడ్‌ ల్యుకేమియా, మెలనోమా, రొమ్ము, పేగు, చర్మ, ప్రొస్టేట్‌ క్యాన్సర్లకు సంబంధించిన ట్యూమర్లని నివారించినట్లు గుర్తించారు. పొట్ట అల్సర్లకు కారణమైన బ్యాక్టీరియానీ నిర్మూలిస్తుందని కూడా తేలింది.

చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించడం, రక్తనాళాల్లో పూడికల్ని నిరోధించడం ద్వారా హృద్రోగాల్ని రానివ్వదని పరిశోధనలు చెబుతున్నాయి. కాకరలోని పీచువల్ల జీర్ణశక్తీ బాగుంటుంది.
నులిపురుగులు, కాలేయ సమస్యలు, చర్మ వ్యాధులకి కాకర మందులా పనిచేస్తుంది. అందుకే ఈ సమస్యలున్నవాళ్లు టేబుల్‌స్పూను రసాన్ని రోజూ తీసుకుంటే మంచిదని ఆయుర్వేదం చెబుతుంది. కాకరకాయ తినేవాళ్లకి నిద్ర సమస్యలు తగ్గుతాయట. ఇది నెలసరి నొప్పుల్నీ తగ్గిస్తుంది.

కీళ్లనొప్పులకీ కాకరకాయ ఔషధగుళికే. ఇందులో అధికంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తప్రసరణకు తోడ్పడతాయి. దాంతో జుట్టు, చర్మం కూడా మెరుపుని సంతరించుకుంటాయి.
కాకరలో ఎక్కువగా ఉండే ఎ-విటమిన్‌ కంటిచూపుని పెంచి, క్యాటరాక్ట్‌ రాకుండా అడ్డుకుంటుందట. ఇందులోని రసాయనాలు మలేరియానీ నివారించినట్లు కొన్ని పరిశోధనల్లో స్పష్టమైంది.

ఊబకాయం, మూత్ర వ్యాధులతో బాధపడేవాళ్లు తరచూ కాకరకాయ తింటే ఫలితం ఉంటుంది. ఆస్తమాతోపాటు దీర్ఘకాలిక శ్వాసకోశ సమస్యల్ని ఇది తగ్గిస్తుంది.
రింగ్‌వార్మ్‌, సొరియాసిన్‌, దురదలు వంటి వ్యాధులతో బాధపడేవాళ్లకి కాకరకాయ రసం ఎంతో మేలు. ఎగ్జిమా వంటి చర్మసమస్యలతో బాధపడేవాళ్లు కాకర ఆకుల్ని నూరి ఆ ముద్దను ఆయా భాగాల్లో పెడితే అవి తగ్గుముఖం పడతాయి. ముఖంమీద మొటిమలూ మచ్చలూ కూడా తగ్గుతాయి.

కాకరకాయ జ్యూస్‌ తాగితే రక్తంలో చక్కెర శాతం తగ్గుతుంది. కానీ మధుమేహానికి మందులు వాడుతూ దీన్ని తాగడం వల్ల చక్కెర నిల్వలు బాగా పడిపోయి ప్రాణానికే ప్రమాదం కావచ్చు. కోమాలోకి వెళ్లే ప్రమాదమూ ఉంది. గుండెవేగంలో మార్పులు వచ్చి మతిమరపు, పక్షవాతం రావచ్చు. గర్భిణీలకి గర్భస్రావం కావచ్చు. కాబట్టి జ్యూస్‌ రూపంలో తీసుకునేవాళ్లు వైద్యుల సలహా తీసుకుని వాడాలి.