హిందువులు పవిత్రంగా జరుపుకునే పండగలలో ఒకటి.. శ్రీ కృష్ణ జన్మాష్టమి. ఈ పర్వదినాన్నే కృష్ణాష్టమి, గోకులాష్టమి అని కూడా అంటారు. ఈ సంవత్సరం శ్రీకృష్ణాష్టమి ఎంతో పవిత్రమైన ఈ రోజు శ్రీకృష్ణ భగవానుడు 5251 వ జయంతిని జరుపుకుంటున్నాడు. ఈ పవిత్రమైన రోజున చిన్నారులకు కృష్ణుడి రూపంలో అలంకరించి పూజిస్తారు. శ్రీ కృష్ణుడిని నీలం రంగు పుష్పాలతో పూజిస్తే కృష్ణుడి సంపూర్ణమైన అనుగ్రహం లభించి శుభ ఫలితాలు కలుగుతాయంటున్నారు జ్యోతిష్య పండితులు. అలాగే.. తులసీదళాలంటే నల్లనయ్యకు మహాప్రీతి. కాబట్టి జన్మాష్టమి నాడు స్వామి వారిని తులసి దళాలతో ఆరాధించినా ఆయన సంపూర్ణ మైన అనుగ్రహం లభిస్తుందంటున్నారు.
ఈ పవిత్రమైన రోజు ఉపవాస దీక్షను కూడా ఆచరిస్తారు. శ్రావణ మాసంలో లభించే పళ్లు, శొంఠి, బెల్లం కలిపిన పెరుగు, వెన్న, జున్ను, మీగడ, రుచికరమైన వంటకాల్లో ఏదైనా ప్రిపేర్ చేసి నల్లనయ్యకు నైవేద్యంగా పెడితే అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు లభిస్తాయంటున్నారు. శ్రీకృష్ణుని పూజించేటప్పుడు పంచామృతాన్ని నైవేద్యంగా సమర్పించాలి. అంతే కాదు కృష్ణుడికి గంగాజలంతో తప్పనిసరిగా అభిషేకం చేయాలి. నెమలీకలతో కృష్ణుడిని అలంకరించాలి. పూజ సమయంలో కిరీటంలో నెమలీకలను పెట్టి పూజిస్తే కృష్ణుడు సంతోషిస్తాడు. అంతేకాదు.. శ్రీకృష్ణాష్టమి నాడు నల్లనయ్యను ఒక్కొక్క రకం పుష్పంతో పూజిస్తే ఒక్కొక్క రకం ప్రయోజనం చేకూరుతుందంటున్నారు.
అయితే ఈ సమయంలో అనేక నియమాలు పాటించాలి. ముఖ్యంగా శ్రీ కృష్ణ జన్మాష్టమి వేళ ఉపవాసం ఉండే వారంతా బ్రహ్మచర్యం పాటించాలి. ఈ పర్వదినాన పండ్లను మాత్రమే తీసుకోవాలి. ఈరోజున ఉపవాసం ఉండే వారు సూర్యోదయం తర్వాతు ఉపవాస దీక్ష విరమించాలి. ఈ కింది నియమాలు పాటించాలి.
*ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలి.
*గోవులపై దయతో వ్యవహరించాలి. జంతువులకు ఆహార, పానీయాలు అందించడం వల్ల కృష్ణుడి ఆశీర్వాదం లభిస్తుంది.
*కృష్ణ జన్మాష్టమి రోజున తులసి ఆకులను తెంపకూడదు. ఎందుకంటే శ్రీ మహా విష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనది తులసి మొక్క.
*చెట్లను కూడా నరకొద్దు.ఇలా చేస్తే అశుభం కలిగే ప్రమాదం ఉంది.
*జన్మాష్టమి రోజున మాంసం, మద్యం తీసుకోకూడదు. కేవలం సాత్విక ఆహారమే తీసుకోవాలి.
*భాగస్వామితో బంధాలకు, ప్రేమానురాగాలకు దూరంగా ఉండాలి.
*ఎలాంటి జంతువులకు హాని చేయకూడదు.
*ఎవరిపై కోప్పడకూడదు, ఎవ్వరినీ అగౌరపరచకూడదు.
కృష్ణాష్టమి రోజు చేసే పూజలలో ఈ విషయాలను ప్రతి ఒక్కరూ తప్పక గుర్తుంచుకోవాలి. ఈ విధంగా కృష్ణాష్టమి రోజు పూజలు చేస్తే కృష్ణుడి కటాక్షం తప్పనిసరిగా మనపైన ఉంటుంది.