ఏపీలో వరద బాధితుల కోసం సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా రెండు రోజులుగా విజయవాడలోనే ఉంటూ ప్రత్యక్షంగా వెళ్లి బాధితులకు భరోసా ఇస్తున్నారు. కొన్ని చోట్ల ఆహారం అందలేదని ఫిర్యాదులు వస్తుండటంత అధికారులను గట్టిగా హెచ్చరించారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విజయవాడ రెండు రోజులుగా పగలు, రాత్రి అనే తేడా లేకుండా సీఎం పర్యటనలు చేస్తున్నారు. తాజాగా సితార సెంటర్ లో సీఎం చంద్రబాబు జేసీబీ ఎక్కి వరద కాలనీల్లో పరిస్థితి పరిశీలించారు . ఆహారం అందుతుందా..? లేదా..? అని బాధితులను అడిగి తెలుసుకుంటున్నారు. స్వయంగా ఇళ్ల వద్దకు వెళ్లి వివరాలు తెలుసుకుంటున్నారు. ప్రజల నుంచి వచ్చే స్పందన ఆధారంగా అధికారులపై చర్యలు ఉంటాయని చంద్రబాబు తెలిపారు.
సీఎం చంద్రబాబుతో సహా ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం మొత్తం విజయవాడ, గుంటూరుల్లో మకాం వేసింది. కొల్లు రవీంద్ర, పొంగూరు నారాయణ.. ఇలా దాదాపుగా మంత్రులందరూ రోడ్ల మీదే ఉంటోన్నారు. హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత సైతం వరద బాధితుల సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటోన్నారు. ప్రకాశం బ్యారేజీ ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లో సహా భారీ వర్షాలపై విపత్తుల నిర్వహణ విభాగం కార్యాలయంలో సమీక్షలను నిర్వహిస్తోన్నారు. అందరూ ఉన్నప్పటికీ- డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాత్రం అందుబాటులో ఉండకపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. విజయవాడలో వరద సంభవించి మూడు రోజులు అవుతున్నప్పటికీ ఆయన ప్రస్తావన కనిపించడం లేదు. ఏపీలోనే ఉంటే మంగళగిరి లోనే వుండి వుంటే కనీసం ఓ దగ్గర కాకుంటే మరో దగ్గర అయినా సహాయ కార్యక్రమాలు పర్యవేక్షించే అవకాశం వుండేది. అలాంటి వార్తలు ఒక్కటి కూడా లేదు. జస్ట్ ట్విట్టర్ లో ఓ పత్రికా ప్రకటన మినహా మరేమీ లేదు.
పవన్ కల్యాణ్ కనిపించకపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రముఖ నటి పూనమ్ కౌర్.. తెర మీదికి వచ్చారు. తన అధికారిక ఎక్స్ హ్యాండిల్‌లో ఘాటు కామెంట్స్ పెట్టారు. సంక్షోభ సమయాల్లో ప్రజలకు అందుబాటులో లేకపోవడం పట్ల తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టారు. ఇలాంటి సంక్షోభం, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు రాజకీయ నాయకులు అందుబాటులో ఉండకపోవడం, వాళ్లు కనిపించకపోవడం సరికాదని పూనమ్ పేర్కొన్నారు. ఇది ఆ రాజకీయ నాయకుల పచ్చి అవకాశవాదానికి, నిలువెత్తు స్వార్థానికి ప్రతీకగా అభివర్ణించారు. ఆమె చేసిన ఈ పోస్ట్ పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించే అయివుంటుందంటూ రిప్లైలు పెడుతున్నారు నెటిజన్లు.