తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం మొత్తం అతలాకుతలం అయిపోయింది. వరద ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్నవారు రోజులు గడుస్తున్న ఇంకా బిక్కుబిక్కుమంటునే గడుపుతున్నారు. చాలా మంది నిరాశ్రయులయ్యారు. ఇక తినడానికి తిండి లేక, తాగడానికి నీరు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, ఉద్యోగులు.. ఇలా ఎవరికి తోచిన సహాయాన్ని వారు వరద బాధితుల కోసం ప్రభుత్వానికి అందిస్తున్నారు. సినీ నటలు ఎన్టీఆర్, మహేశ్ బాబు, వైజంతి మూవీస్ అధినేత అశ్వనీదత్, యువ హీరోలు సిద్ధు జొన్నలగడ్డ, విష్వక్సేన్ తదితరులు వరద సహాయ నిధికి విరాళాలు ప్రకటించారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా తెలుగు రాష్ట్రాలకు రూ.కోటి విరాళం ప్రకటించారు.
తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం వల్ల ప్రజలకు కలిగిన, కలుగుతున్న కష్టాలు నన్ను కలిచివేస్తున్నాయి. పదుల సంఖ్యలో అమాయక ప్రాణాలు కోల్పోవడం ఎంతో విషాదకరం. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నిర్దేశంలో రెండు ప్రభుత్వాలు శాయశక్తులా పరిస్థితిని మెరుగు పరచడానికి కృషి చేస్తున్నాయి. మనందరం ఏదో విధంగా సహాయక చర్యల్లో పాలుపంచుకోవాల్సిన అవసరం వుంది. ఈ ప్రక్రియలో భాగంగా రెండు రాష్ట్రాల లో ప్రజల ఉపశమనానికి తోడ్పాటుగా నా వంతు కోటి రూపాయలు(ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు చెరో 50 లక్షలు) విరాళంగా ప్రకటిస్తున్నాను. ఈ విపత్కర పరిస్థితులు తొందరగా తొలగిపోవాలని, ప్రజలంతా సురక్షితంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను అని ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. కాగా సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కోటి రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఇక మరో టీడీపీ నేత, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మరో కోటి రూపాయలు వరద బాధితుల కోసం ఇచ్చారు.
హెరిటేజ్ ఫుడ్స్ మేనేజింగ్ డైరెక్టర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి భారీ విరాళాన్ని ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాలుల్లో వరద సహాయక చర్యల కోసం ఒక్కో రాష్ట్రానికి కోటి రూపాయల చొప్పున మొత్తాన్ని విరాళంగా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. సంక్షోభ సమయంలో తెలుగు ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని భువనేశ్వరి గుర్తు చేశారు. వరదల ఎన్నో కుటుంబాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయని, ప్రతి ఒక్కరికీ హెరిటేజ్ ఫుడ్స్ అండగా ఉంటుందని ఆమే అన్నారు. రెండు రాష్ట్రాలు సత్వరమే కోలుకోవాలని ఆకాంక్షించారు.