డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిని ప్రతి రోజూ తీసుకోవడం వల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. డ్రై ఫ్రూట్స్ రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు శరీరంలో మెటబాలిక్ రేట్ ను క్రమంగా పెంచుతాయి. నట్స్ లో అధిక న్యూట్రిషియన్స్, ప్రోటీన్స్, విటమిన్స్, డైటరీ ఫైబర్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ప్రతి రోజూ తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి అవసరమైన పోషకాలను కలిగి ఉండి తక్షణ శక్తిని అందిస్తాయి.
వాల్ నట్స్
చాలామంది వాల్ నట్స్ ను బ్రెయిన్ ఫుడ్ అని పిలుస్తారు. ఈ డ్రైఫ్రూట్ చూడటానికి అచ్చు బ్రెయిన్ ను పోలి ఉంటుంది. మెదడుకు సంబంధించిన అన్ని సమస్యలను చాలా సమర్ధవంతంగా నివారిస్తుంది. అంతేకాదు ప్రతిరోజు 5 వాల్ నట్స్ తింటే గ్లాసు పాలతో సమానం అవుతుంది. వాల్ నట్స్ ప్రాణాంతక వ్యాధులైన క్యాన్సర్, డయాబెటిస్ వంటి వ్యాధులను తగ్గిస్తాయి. ఇవి శరీర బరువు తగ్గించడంలో ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఎటువంటి సమస్యలనైనా ఎదుర్కోడానికి దోహదపడతాయి.. ప్రతినిత్యం వాల్ నట్స్ తినడం వలన జ్ఞాపకశక్తి మెరుగుపడటంతో పాటు గాఢమైన నిద్ర పడుతుంది. హార్ట్ కు కూడా చాలా మంచిది. అంతేకాదు వంద్యత్వంతో బాధపడుతున్నవారిలో స్పెర్మ్ కౌంట్ పెరగడానికి కూడా వాల్ నట్స్ ఉపయోగపడతాయి.
పిస్తా
పిస్తా పప్పు పోషకాల గని. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ రోగనిరోధకశక్తిని పెంపొందించి గుండె జబ్బులు రాకుండా నివారిస్తుంది. పిస్తా పప్పు డైలీ తీసుకుంటే బరువు సులువుగా తగ్గొచ్చు.
క్యాన్సర్‌తో ప్రతి సంవత్సరం లక్షలాది మంది మరణిస్తున్నారు. అంతే కాదు చికిత్స తర్వాత చాలామంది బలహీనంగా మారిపోతున్నారు. వీరికి పిస్తా ఓ వరం లాంటిది. గుండె జబ్బులతో బాధపడేవారు రోజూ పిస్తా తింటే ఉపయోగం ఉంటుంది. పిస్తా తినడం కొలెస్ట్రాల్‌ను సమతుల్యం చేయడానికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. పిస్తాకు న్యూరోప్రొటెక్టివ్ యాక్టివిటీ ఉంటుంది. మెదడు పని సామర్థ్యానికి ఇది చాలా చురుకుగా పరిగణించబడుతుంది. డయాబెటిస్‌తో బాధపడేవారికి పిస్తా సమర్థవంతంగా పనిచేస్తుంది.
బాదంపప్పు
ప్రతిరోజూ కొన్ని బాదం గింజల్ని తీసుకుంటే చాలా మంచిది. బాదంపప్పులలో చాలా ఎక్కువ పోషకాలు ఉంటాయి. ముఖ్య పోషకపదార్థాలైన ప్రొటీన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, ఒమేగా-6 ఫ్యాటీయాసిడ్లు, విటమిన్ ఇ, కాల్షియం, ఫాస్పరస్, జింక్, కరిగే మరియు కరగని పీచు పదార్థం వంటివి ఎన్నో ఉంటాయి. నానబెట్టిన బాదంపప్పు తినటం మరింత ఆరోగ్యకరం అని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. ఎందుకంటే రాత్రంతా నానబెట్టిన బాదంపప్పులలో నీరు దాని తొక్కుపై ఉన్న విషపదార్థాలను తొలగించివేస్తుంది. ఫైటిక్ యాసిడ్ ను విడుదల చేస్తుంది. బాదం గ్లూటెన్ పదార్థాలను విఛ్చిన్నం చేస్తుంది. నానబెట్టిన బాదంపప్పులలో ప్రొటీన్, పొటాషియం మరియు మెగ్నీషియం ఉండి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచి, ప్రాణాంతక గుండె జబ్బులతో పోరాడటంలో సహాయపడతాయి.