నాంపల్లి కోర్టుకు వెళ్లిన నాగార్జున

Nagarjuna Went To Nampally Court

టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున నాంపల్లి కోర్టు హాజరయ్యారు. ఆయన భార్య అక్కినేని అమల, తనయుడు నాగచైతన్య, యార్లగడ్డ సుప్రియ తదితరులు నాంపల్లి కోర్టుకు వచ్చారు. నాగచైతన్య-సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల మీద నాగార్జున కోర్టులో పరువునష్టం దావా వేసిన విషయం తెలిసిందే. కొండా సురేఖపై పిటిషన్ ఎందుకు దాఖలు చేశారని నాగార్జునను న్యాయస్థానం ప్రశ్నించింది.

తన కుటుంబంతో పాటు నాగచైతన్య-సమంత విడాకుల అంశంపై మంత్రి సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేశారని కోర్టుకు నాగార్జున తెలిపారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలతో తమ కుటుంబ పరువు, మర్యాదలకు భంగం వాటిల్లిందని ఆయన వాంగ్మూలం ఇచ్చారు. రాజకీయ దురుద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారని, అన్ని టీవీ ఛానళ్లలోనూ ఇది ప్రసారమైందని వెల్లడించారు. తమపై అసత్య ఆరోపణలు చేసిన ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని వాంగ్మూలం సందర్భంగా కోరారు.

ఈ నేపథ్యంలో నాగార్జున స్టేట్‌మెంట్‌ను నాంపల్లి కోర్టు రికార్డ్ చేసింది. సినిమా రంగం ద్వారా తమ కుటుంబానికి మంచి పేరు, ప్రతిష్ఠలు ఉన్నాయని నాగార్జున తెలిపారు. దేశవ్యాప్తంగా తమ కుటుంబం పట్ల ప్రజల ఆధారాభిమానాలు ఉన్నాయని అన్నారు. జాతీయ స్థాయిలో అనేక అవార్డులు వచ్చాయని, సినిమా రంగంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు సైతం చేస్తున్నామని తెలిపారు. తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది.

తన కొడుకు నాగ చైతన్య, సమంతల విడాకులు మాజీ మంత్రి కేటీఆర్ కారణంగా జరిగాయని మంత్రి కొండా సురేఖ అసభ్యంగా మాట్లాడారని చెప్పారు. మహిళా మంత్రి బహిరంగంగా అలా మాట్లాడం వల్ల మా కుటుంబ పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లిందని నాగార్జున స్టేట్ మెంట్ ను కోర్టు రికార్డు చేసింది. తమ పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లేలా వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోర్టును నాగార్జున కోరారు.

మంత్రి కొండా సురేఖ ఇటీవల రాజకీయ విమర్శల్లో భాగంగా నాగార్జున, నాగచైతన్య, సమంత పేర్లను ప్రస్తావించిన విషయం తెలిసిందే.. కేటీఆర్ తో ముడిపెడుతూ ఆమె చేసిన వ్యాఖ్యలపై తెలుగు సినీ ప్రముఖులు తీవ్రంగా స్పందించారు. చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, మహేశ్ బాబు, నాని తదితరులు ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.