సుప్రీంకోర్టులో న్యాయ దేవత కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేసిన సీజేఐ… ఈ విగ్రహంలో కొన్ని మార్పులను చేశారు. విగ్రహానికి ఇప్పటి వరకూ మనం చూస్తున్న కళ్లకు గంతలు తొలగించడంతో పాటు, చేతిలోని కత్తి స్థానంలో రాజ్యాంగ పుస్తకాన్ని ఇచ్చారు. భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ఈ మార్పులు చేశారు.
భారతదేశంలో చట్టం గుడ్డిది కాదని చూపించడానికి విగ్రహాన్ని అలా చేయించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల లైబ్రరీలో ఈ కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని తయారు చేయాలని సీజేఐ చంద్రచూడ్ స్వయంగా ఆదేశించారు. నిజానికి, పాత విగ్రహంలో చూపబడిన చట్టానికి కళ్లు ఉండవు ..అందరికీ సమన్యాయం అనేలా ఉండే చిహ్నం నేటి కాలానికి తగినది కాదని.. అందుకే ఈ మార్పులు చేయబడ్డాయని ఆయన వివరించారు.
అంతకుముందు న్యాయ దేవత విగ్రహంలో కళ్లకు గంతలు కట్టడంతో చట్టం అందరినీ సమానంగా చూస్తుందని అర్ధం వచ్చేలా ఉండేది. చట్టానికి అధికారం ఉందని, తప్పు చేసిన వారిని శిక్షించవచ్చనే ఉద్దేశంగా.. చేతిలో ఉన్న కత్తి చూపించింది. అయితే, కొత్త విగ్రహంలో మారని విషయం ఏమిటంటే, విగ్రహం ఒక చేతిలో తక్కెడ ఉండటం. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు కోర్టు రెండు పక్షాల వాదనలను జాగ్రత్తగా వింటుందని ఇది చూపిస్తుంది.
న్యాయస్థానాలలో మనం తరచుగా చూసే న్యాయ దేవత నిజానికి గ్రీకుల దేవత. ఆమె పేరు జస్టియా కాబట్టి.. ఆమె పేరు నుంచి ‘జస్టిస్’ అనే పదం వచ్చింది. 17వ శతాబ్దంలో కోర్టులో పనిచేసే ఒక బ్రిటిష్ అధికారి ఈ విగ్రహాన్ని తొలిసారి ఇండియా తీసుకువచ్చారు. 18వ శతాబ్దంలో బ్రిటిష్ రాజ్ కాలంలో న్యాయ దేవత విగ్రహాన్ని ప్రజల ముందుకు తీసుకువచ్చారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చాక కూడా ఇదే విగ్రహాన్ని కొనసాగించారు.
న్యాయ దేవత విగ్రహానికి ఎందుకు కళ్లకు గంతలు కట్టారనే దానికి సమాధానం ఆసక్తికరంగానే ఉంటుంది. ఎందుకంటే ఒకరిని చూసిన వెంటనే వారిని అంచనా వేయడం పక్షపాతంగా ఉంటుంది కాబట్టి.. కళ్లకు గంతలు కట్టుకోవడం అంటే న్యాయ దేవత ఎప్పుడూ నిష్పక్షపాతంగానే అందరికీ న్యాయం చేస్తుందని అర్థం. న్యాయానికి వివక్ష ఉండదని కూడా అర్ధం.