మెంతుల్ని మనం వండే కూరల్లో ఎక్కువగా వాడతాం. ఇవి రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా రకాలుగా మేలు చేస్తాయని పెద్దలు చెబుతారు. అంతేకాదు మెంతి గింజల్లో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండటంతో..ఆరోగ్యానికి మంచి చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు మెంతులు చర్మం, జుట్టుకు పోషకాలు అందిస్తాయంటున్నారు నిపుణులు. ప్రతి రోజు మెంతి నీటిని తాగినట్లయితే మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు.
మెంతుల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఈ మెంతి నీళ్లను తాగితే కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. కాబట్టి ఏమీ తినడానికి ఇష్టపడరు. ఫలితంగా ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అంతేకాదు ఇది ఉబ్బరం నివారించడానికి సహాయపడుతుంది.
మెంతుల్లో జుట్టు పెరుగుదలకు సహాయపడే పోషకాలు అధికంగా ఉన్నాయి. ఇది జుట్టు ఒత్తుగా పెరగడానికి, దృఢంగా అవడానికి, చుండ్రు సమస్యలను నివారించడానికి బాగా పనిచేస్తుంది. మెంతుల పొడి హెన్నా పొడిలో కలిపి జుట్టుకు పెట్టుకుని స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. పెరుగులో మెంతులు నానబెట్టి ఆ ఫేస్ట్ ను తలకు అప్లై చేసినా జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
మెంతులు షుగర్ పేషెంట్స్ కి గొప్ప ఔషధం. రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో మెంతులు దోహదపడతాయి. మెంతి గింజల్లో అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో సహాయపడతాయి.
మెంతులు మూత్రపిండాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. మెంతుల వినియోగం మూత్రపిండాలలో రాళ్ల చికిత్సకు కూడా సహాయపడుతుంది. మెంతి నీళ్లు శరీరం నుంచి హానికరమైన విష పదార్థాలను బయటకు పంపుతాయి. ఇది జీర్ణక్రియ సంబంధిత సమస్యలతో బాధ పడుతున్న వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మలబద్దకం, అజీర్ణం వంటి జీర్ణ సమస్యలను నివారిస్తుంది.
మెంతిగింజల నీటిని తయారుచేయడానికి.. ఒక కడాయిలో మెంతి గింజలను సన్నని మంటపై వేయించాలి. తర్వాత ఈ మెంతులను మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో 1 టీస్పూన్ మెంతి పొడి వేసి కలపాలి. ప్రతిరోజు ఉదయం ఈ వాటర్ తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుంటాయని నిపుణులు చెబుతున్నారు.