బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా మారింది. అది ఉత్తర దిశగా కొనసాగుతూ.. దిశ మార్చుకుంటూ పశ్చిమ వాయువ్య దిశగా వెళ్లబోతోంది. ఈ తరుణంలో ఏపీలో వాతావరణం ఒక్కసారిగా మారింది.
ఏపీలో వాయుగుండం ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో అది తీవ్ర వాయుగుండం స్థిరంగా కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం వరకు ఇది ఉత్తర దిశగా ఇలాగే కొనసాగనుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
ఆ తర్వాత వాయువ్య దిశగా కదులుతూ శుక్రవారం సాయంత్రానికి బలహీనపడి అల్పపీడనంగా మారబోతోంది. దాని తరువాత అదే దిశలో కదులుతూ నవంబర్ 30న అంటే శనివారం ఉత్తర తమిళనాడు, పాండిచ్చేరి మధ్య తీరం దాటొచ్చు. దీని ప్రభావంతోనే ఏపీలో ఈ రెండు రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
కొన్ని జిల్లాల్లో శుక్రవారం, శనివారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. దక్షిణ కోస్తా తో పాటు రాయలసీమ జిల్లాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ రోజు తిరుపతి,నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. చిత్తూరు, కడప, సత్యసాయి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది.
ఏపీ వ్యాప్తంగా తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండటంతో పాటు.. చల్లటి గాలులు వీస్తున్నాయి. ఆకాశం మేఘవృత్తమయి పగటి ఉష్ణోగ్రతలు అమాంతం పడిపోయాయి. చలికి తోడు చల్లటి గాలులు వీస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.ఉదయం 8 గంటలయినా కూడా బయటకు రాలేని పరిస్థితి కనిపిస్తోంది.
మరోవైపు తీరం వెంబడి గంటకు 35 నుంచి 55 కి.మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారడంతో..మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. కోస్తాంధ్రలోని తీర ప్రాంతంలో ఒకటో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.
ఒకవైపు ఏపీ వ్యాప్తంగా వరి కోతలు సాగుతుండగా..అధికారుల భారీ వర్ష హెచ్చరికలతో రైతులలో ఆందోళన మొదలయింది. వర్షాలు పడుతుండటంతో..వరి కోతలను నిలిపివేయాలని.. వర్షం తెరిపినిచ్చాక వరి కోతలు చేసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు రైతులకు సూచిస్తున్నారు.