అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా విడుదల హంగామా మధ్య Hyderabad RTC క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద దురదృష్టకర సంఘటన చోటుచేసుకుంది. బుధవారం (డిసెంబర్ 4) రాత్రి ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోగా, ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్రంగా గాయపడ్డాడు.
సాధారణంగా సంధ్య థియేటర్ వద్ద భారీ సంఖ్యలో అభిమానులు చేరుతుంటారు. అల్లు అర్జున్ కూడా థియేటర్‌కి రావడంతో అభిమానులు ఉత్సాహంతో గుంపుగా చేరి అపశ్రుతికి దారితీశారు. పోలీసులు లాఠీచార్జి చేసినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు. రేవతి, ఆమె కుమారుడు తొక్కిసలాటలో కిందపడ్డారు. పోలీసులు సీపీఆర్ అందించినా, రేవతిని కాపాడలేకపోయారు.
ఈ సంఘటనపై అల్లు అర్జున్ టీమ్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. రేవతి కుటుంబానికి అవసరమైన సహాయం అందించనున్నట్లు ప్రకటించింది.
రేవతి భర్త భాస్కర్ మీడియాతో మాట్లాడుతూ “మా బాబు శ్రీతేజ అల్లు అర్జున్‌కు పెద్ద ఫ్యాన్. ఆ ఉత్సాహంతోనే సినిమాకి వెళ్లాం. కానీ, నా భార్యను కోల్పోవడం తట్టుకోలేకపోతున్నా. మా బాబు పరిస్థితి విషమంగా ఉంది. అల్లు అర్జున్ మా కుటుంబానికి అండగా ఉండాలని కోరుతున్నాం.”
పుష్ప 2 ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయింది. సినిమా మాస్ లుక్, పుష్ప బ్రాండ్ హైప్ అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. అయితే ఈ హంగామా పలు చోట్ల తీవ్రమైంది.
మంచిర్యాల జిల్లాలో ఉద్రిక్తత
మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలో థియేటర్ యాజమాన్యం పుష్ప 2 ప్రదర్శించలేదనే ఆగ్రహంతో అభిమానులు థియేటర్ అద్దాలు ధ్వంసం చేశారు. థియేటర్ యజమాని కారుపైనా దాడి చేశారు. పోలీసుల సీసీ కెమెరాల ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్నారు.
“Pushpa 2: The Rule” విడుదల అభిమానుల అంచనాలను మించి విశేష స్పందన పొందింది. కానీ, ఈ ఉత్సాహం కొన్ని చోట్ల విషాదానికి దారితీసింది. అభిమానుల ప్రవర్తనపై అవగాహన అవసరం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.