మంచు మోహన్ బాబు కుటుంబంలో ఆస్తుల వివాదం నేపథ్యంలో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. జలపల్లిలోని మోహన్ బాబు నివాసంలో నిన్నటి నుండి హై టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. మంచు విష్ణు తరఫున 40 మంది బౌన్సర్లు చేరుకోగా, మంచు మనోజ్ కూడా తన తరఫున 30 మంది బౌన్సర్లను రంగంలోకి దించారు. అయితే మనోజ్ తరఫున వచ్చిన బౌన్సర్లను ఇంటి ప్రాంగణంలోకి అనుమతించలేదని సమాచారం.
ఇదే సమయంలో, దుబాయ్ నుంచి మంచు విష్ణు ఇంటికి చేరుకోగా, ముంబైలో ఉన్న మంచు లక్ష్మి కూడా ఇంటికి చేరుకున్నారు. ఫ్యామిలీ సభ్యులంతా చేరుకోవడంతో, ఇంట్లో అసలు ఏమి జరుగుతుందన్న దానిపై జనం కుతూహలంగా ఎదురుచూస్తున్నారు.
ఇప్పటి వరకు వచ్చిన సమాచారం ప్రకారం, మోహన్ బాబు, మంచు మనోజ్ మధ్య ఆస్తుల పంపకాల విషయంలో వివాదం చోటుచేసుకుంటోంది. నిన్న, మంచు మనోజ్ తన భార్యతో కలిసి జరిగిన దాడి విషయం పహడి షరీఫ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు వార్తలు వచ్చాయి. అయితే, కుటుంబ సభ్యులు ఈ వార్తలను ఖండించారు.
మరోవైపు, మంచు మనోజ్ నిన్న సాయంత్రం అనుమానాస్పద దెబ్బలతో బంజారాహిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. మెడ మరియు కాలు భాగంలో గాయాలతో 24 గంటల అబ్జర్వేషన్‌లో ఉండాలని వైద్యులు సూచించగా, మనోజ్ మాత్రం తాత్కాలికంగా డిశ్చార్జ్ అయ్యారు.
ఈ రోజు పోలీసులు మోహన్ బాబు ఇంటిని సందర్శించి గాయాల గురించి వివరాలను సేకరించనున్నారు. దానికి తోడు బౌన్సర్ల సమీకరణ, కుటుంబ సభ్యుల మధ్య వివాదం ఇంకా మలుపులు తీసుకుంటుండడంతో జలపల్లి వాతావరణం హై టెన్షన్‌గా మారింది.