అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ సాధించిన డొనాల్డ్ ట్రంప్ 2025, జనవరి 20న అమెరికా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. దీనికోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ట్రంప్ తాను ప్రచార సమయంలో ఇచ్చిన ఎన్నికలల హామీలపై దృష్టి పెట్టారు.
అమెరికా 47వ అధ్యక్షుడిగా వైట్‌హౌస్‌లో మరోసారి అడుగు పెట్టనున్న ట్రంప్.. అధికార బదిలీకి సమయం ఉండడంతో మంత్రివర్గ కూర్పు, కార్యవర్గం ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే తన విధేయులకు మంత్రి పదవులు, సమర్థులకు వైట్‌హౌస్‌తోపాటు వివిధ విభాగాలలోని బాధ్యతలు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు. జనవరి 20 తర్వాత వీరందరి నియామకాలు జరగనున్నాయి.
ట్రంప్ ఎన్నికల సమయంలో తాను అధికారంలోకి వస్తే.. అమెరికాను గొప్పగా తీర్చిదిద్దుతానని యుద్ధాలు ఆపుతానని ప్రకటించారు. అక్రమంగా అమెరికాలో ఉంటున్నవారందరినీ తరిమి కొడతామని హెచ్చరించారు. ఇప్పుడు ఆ ఈ హామీల అమలుపైనే ట్రంప్ దృష్టి పెట్టారు. చట్టబద్ధంగా అమెరికా వచ్చేవారికి మార్గం సుగమం చేయడంలో భాగంగా ట్రంప్ చర్యలు చేపడుతున్నారు. ఈ నిర్ణయం భారతీయులకు శుభవార్తేనని అంటున్నారు నిపుణులు.
.
తాజాగా ఎన్‌బీసీ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చిన ట్రంప్..అమెరికాకి సాధికారికంగా ప్రవేశం పొందాలనుకునేవారు తమ దేశాన్ని కూడా ప్రేమించాలని అన్నారు. కొన్ని దేశాల్లో జైళ్ల నుంచి నేరస్తులు అమెరికాకు వస్తున్నారని చెప్పిన ట్రంప్ అలాంటివారు 13,099 మంది ఉన్నట్లు తెలిపారు.ఈ నేరస్థులంతా అమెరికా వీధుల్లో స్వేచ్ఛగా తిరుగుతున్నారని పేర్కొన్నారు. ఇలాంటి ప్రమాదకర వ్యక్తులను దేశంలో ఉండకుండా తాము వెళ్లగొడతామని తెలిపారు.
అంతేకాదు ఇలా ఎన్నో ఏళ్ల క్రితం అమెరికాకు అక్రమంగా వలస వచ్చిన తల్లిదండ్రుల సంతానంలో చాలా మంది ఇక్కడే పుట్టి పెరిగారని ట్రంప్ గుర్తు చేశారు. వారిలో చాలా మంది మంచి స్థాయిలో స్థిరపడ్డారని.. వారి సమస్యను తాము తప్పనిసరిగా పట్టించుకుంటామని చెప్పారు. ప్రతిపక్ష డెమొక్రాట్లతో కలిసి అక్రమ వలసలకు పరిష్కారం కనుగొంటామని అన్నారు.
పొరుగు దేశాలైన కెనడా, మెక్సికో నుంచి లక్షల మంది అమెరికాలోకి అక్రమంగా వలస వస్తున్నారని ట్రంప్ తెలిపారు. దీనిని నిరోధించకపోతే.. ఈ రెండు దేశాలపై 25 శాతం సుంకాలు విధిస్తామని అన్నారు. అలా చేయకపోతే అమెరికాలో 51వ రాష్ట్రంగా కెనడా, 52వ రాష్ట్రంగా మెక్సికో చేరిపోవడం మంచిదని సెటైర్ వేశారు.