ఏపీ కేబినెట్‌లో తాజాగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నిషేధిత జాబితా నుంచి అక్రమంగా తొలగించిన భూములపై నిర్ణయం తీసుకునేందుకు మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వైసీపీ హయాంలో దాదాపు 7 లక్షల ఎకరాల భూములు నిషేధిత జాబితా నుంచి తొలగించారు. దీనిపై అధ్యయనం చేసి ఆయా భూములను ఏం చేయాలన్న దానిపై ప్రభుత్వానికి మంత్రుల కమిటీ నివేదిక ఇవ్వనుంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి తల్లికి వందనం ఇవ్వాలని , కేంద్రం పీఎం కిసాన్ వేసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభవ ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే పోలవరం డయాఫ్రం వాల్ వెంటనే ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది.
గ్రామ వార్డు సచివాలయాల్లో రియల్ టైం గవర్నెన్స్ వ్యవస్థ ఏర్పాటుకు ఏపీ కేబినెట్ ఆమోదించింది. అలాగే ఫెర్రో అల్లాయ్స్ పరిశ్రమలకు ఎలక్ట్రిసిటీ డ్యూటీ టారిఫ్ తగ్గింపు ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. నాగావళి నదిపై గౌతు లచ్చన్న తోటపల్లి బ్యారేజ్ పై కుడి, ఎడమ వైపు మినీ హైడల్ ప్రాజెక్టుల నిర్మాణం ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదించింది. మరోవైపు కడప జిల్లా సీకే దిన్నె మండలంలో ఏపీ ఇండస్ట్రియల్ కారిడార్ ఇన్ఫ్రా కార్పొరేషన్ కు కేటాయించిన.. 2595 ఎకరాల బదిలీ కి స్టాంపు డ్యూటీ మినహాయింపునకు కేబినెట్ ఆమోదం చెప్పింది.
అభ్యంతరం లేని ఆక్రమిత స్థలాల క్రమబద్ధీకరణ ప్రతిపాదన పైనా కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. 62 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొత్తగా 62 అన్న క్యాంటీన్ లు ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం లభించింది. ప్రకాశం బ్యారేజి దిగువన కృష్ణా నదికి కుడి వైపున రిటైనింగ్ వాల్ నిర్మించేందుకు.. 294 కోట్లకు అనుమతులు మంత్రిమండలి ఆమోదించింది.
కాగా ధాన్యం కొనుగోలుకు 700కోట్ల రూపాయలు రుణం తీసుకునేందుకు కేబినెట్‌లో చర్చించామని మంత్రి పార్ధసారథి వివరించారు. సేకరించిన ధాన్యానికి 24గంటల్లో.. చెల్లింపులు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదని ఆయన చెప్పారు. ఇప్పటికే రైతుల ఖాతాల్లో 6,200కోట్లు రూపాయలు జమ చేశామన్నారు. ఈ సీజన్‌లో 4.6లక్షల మంది రైతుల నుంచి 28.33లక్షల టన్నుల ధాన్యం సేకరించామని చెప్పారు.
మరోవైపు అందరికీ ఇళ్లు పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు,పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు పట్టాలు ఇచ్చేందుకు విధివిధానాల జారీకి కేబినెట్ ఆమోదించింది. వైసీపీ హయాంలో దాదాపు 7 లక్షల ఎకరాల భూములు నిషేధిత జాబితా నుంచి తొలగించడంతో..నిషేధిత జాబితా నుంచి అక్రమంగా తొలగించిన భూములపై నిర్ణయం తీసుకునేందుకు మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనిపై అధ్యయనం చేసి ఆయా భూములను ఏం చేయాలన్న దానిపై ప్రభుత్వానికి మంత్రుల కమిటీ నివేదిక ఇవ్వనుంది. వచ్చే క్యాబినెట్ భేటీలోపు భూముల అవకతవకలపై నివేదిక ఇవ్వాలన్న సీఎం చంద్రబాబు… భూముల అవకతవకలపై నివేదిక ఇవ్వాలని జిల్లాల ఇన్‌చార్జి మంత్రులకు ఆదేశాలు జారీ చేశారు.