క్రెడిట్ స్కోర్ 300 నుంచి 900 మధ్య ఉంటుంది. ఇది మన ఆర్థిక లావాదేవీలు, రుణ చరిత్ర ఆధారంగా నిర్ణయించబడుతుంది. 750కి పైగా క్రెడిట్ స్కోర్ ఉన్నవారికి రుణం సులభంగా లభించగా, 600 కంటే తక్కువ స్కోర్ ఉన్నవారికి రుణం పొందడం కష్టతరం. అయితే, అత్యవసర పరిస్థితుల్లో క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉన్నా, ఈ మార్గాలను అనుసరిస్తే రుణం పొందే అవకాశం ఉంటుంది.
1. ముందుగా మీ క్రెడిట్ స్కోర్ తెలుసుకోండి
రుణానికి దరఖాస్తు చేసుకునే ముందు మీ క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోవడం అత్యంత ముఖ్యం. దీని ద్వారా మీరు రుణం పొందే అవకాశాలను అంచనా వేసుకోవచ్చు.
2. తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్నవారికి రుణం ఇచ్చే సంస్థలు
కొన్ని ఆర్థిక సంస్థలు తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్నవారికి కూడా రుణాలను అందిస్తాయి. అయితే, ఇవి సాధారణంగా పెద్ద బ్యాంకులతో పోల్చితే అధిక వడ్డీ రేటు వసూలు చేస్తాయి.
3. సెక్యూర్డ్ లోన్ తీసుకోవడం
తక్కువ స్కోర్ ఉన్నవారు సెక్యూర్డ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రుణానికి కారు, స్థిరాస్తి, లేదా ఫిక్స్‌డ్ డిపాజిట్ వంటి ఆస్తులను తాకట్టు పెట్టడం అవసరం. అయితే, రుణం తిరిగి చెల్లించకపోతే ఆస్తి కోల్పోయే అవకాశం ఉంటుంది.
4. గ్యారెంటీ లేదా సహ దరఖాస్తుదారుడితో రుణం
క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటే, మంచి క్రెడిట్ స్కోర్ ఉన్న గ్యారెంటర్ లేదా సహ దరఖాస్తుదారుడు ఉంటే రుణం పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
5. క్రెడిట్ స్కోర్ మెరుగుపర్చుకోవడం
భవిష్యత్తులో అనుకూలమైన రుణ నిబంధనలు పొందేందుకు, క్రెడిట్ స్కోర్ మెరుగుపర్చుకోవడం చాలా ముఖ్యం. ఇందుకోసం క్రమంగా రుణ వాయిదాలను చెల్లించడం, క్రెడిట్ కార్డ్ బిల్లులను సమయానికి క్లియర్ చేయడం మంచిది.
6. ఆదాయ స్థిరతను నిరూపించడం
స్థిరమైన ఆదాయాన్ని రుజువు చేసే జీత స్లిప్పులు, బ్యాంక్ స్టేట్‌మెంట్లు, లేదా ఆదాయపు పన్ను రిటర్న్స్ సమర్పించడం ద్వారా బ్యాంకుల నమ్మకాన్ని పొందవచ్చు.
7. స్వల్పకాలిక రుణాలు తీసుకుని చెల్లించడం
స్వల్పకాలిక రుణాలను తీసుకుని సమయానికి తిరిగి చెల్లించడం ద్వారా క్రెడిట్ స్కోర్ మెరుగుపరుచుకోవచ్చు. దీని వల్ల రుణదాతల నమ్మకం పొందే అవకాశం ఉంటుంది.