ఏపీలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం, బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెట్టాలో త్వరలో నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రవేశపెడుతున్న పూర్తిస్దాయి బడ్జెట్ కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉంటాయి. ఈ అంచనాలను అందుకునేందుకు ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేయాల్సి ఉంది.
రాష్ట్రంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ఈ నెల 24 నుంచి నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అయితే, బడ్జెట్ తేదీని ఈ నెల 6న జరిగే కేబినెట్ భేటీలో నిర్ణయిస్తారు. ఈ మేరకు ప్రభుత్వం ఇప్పటికే వివిధ శాఖల నుంచి ప్రతిపాదనలు తీసుకుంటోంది. ఇందులో పెండింగ్‌లో ఉన్న సంక్షేమ పథకాలతో పాటు, ఆయా శాఖల నుంచి వచ్చిన పలు కీలక ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. వీటిపైనా కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. అలాగే, పలు కీలక బిల్లులను కూడా సిద్ధం చేస్తున్నారు.
ఈసారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మూడు వారాలకు పైగా నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. గతంలో, నాలుగైదు రోజుల పాటు బడ్జెట్ భేటీలు నిర్వహించిన వైసీపీపై టీడీపీతో పాటు కూటమి పార్టీలు మండిపడేవి. ఇప్పుడు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పాటు, విపక్ష వైసీపీ కూడా సభకు రాంచి ఆసక్తి చూపకపోవడంతో, ఎక్కువ రోజులు సమావేశాలు నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకునేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేసుకుంటోంది.
మరోవైపు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కీలకమైన సూపర్ సిక్స్ హామీల్లో పెన్షన్లు మినహా మిగిలిన హామీలు అమలు కాలేదు. దీంతో ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి ఉంది. అందుకే, బడ్జెట్లో వచ్చే ఆర్థిక సంవత్సరంలో సంక్షేమ పథకాలకు ఇచ్చే నిధులపై క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో పథకాలు అమలు చేస్తారా, చేస్తే ఎంత నిధులు ఇస్తారన్న అంశాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఇప్పటికే, కూటమి సర్కార్ పథకాలను పూర్తిగా అటకెక్కించేసిందన్న ప్రచారం నేపథ్యంలో, బడ్జెట్‌పై పథకాల ప్రకటనల కోసం లబ్దిదారులు ఎదురుచూస్తున్నారు. ఈ బడ్జెట్ సమావేశాలు రాష్ట్ర పథకాల పరంగా కీలకమైన తీర్మానాలు తీసుకునే వేదికగా మారుతాయని అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.