తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో కొమురవెల్లి మల్లన్న ఆలయానికి ప్రత్యేక స్థానం ఉంది. ఏటా 25 లక్షల మందికి పైగా భక్తులు దర్శించుకుంటూ, ఆలయానికి సుమారు రూ.18 కోట్ల ఆదాయం తెచ్చిపెడుతున్నారు. అయితే, అంత పెద్ద ఆదాయం ఉన్నా ఈ ఆలయం సాంకేతికత విషయంలో చాలా వెనుకబడి ఉంది. ఇప్పటికీ అధికారిక వెబ్‌సైట్ లేకపోవడంతో భక్తులకు ఆన్‌లైన్ సేవలు అందుబాటులో లేవు. గదుల బుకింగ్, ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనం టికెట్లు, మొక్కుబడి సేవల కోసం భక్తులు ప్రత్యక్షంగా ఆలయానికి వెళ్లాల్సిందే. రద్దీ ఎక్కువగా ఉంటే గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉండాల్సి వస్తోంది.
కొమురవెల్లి మల్లన్న ఆలయానికి తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్రల నుంచి కూడా భక్తులు పెద్దఎత్తున వస్తారు. ప్రతి ఏటా మూడు లక్షల బోనాలు, పట్నాలు సమర్పిస్తారు. కానీ ఆలయంలో ఇప్పటికీ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ అమలు కాలేదు. చిన్న చిన్న ఆలయాల్లో కూడా ఆన్‌లైన్ విరాళాలు, డిజిటల్ హుండీలు ప్రవేశపెట్టినప్పటికీ, మల్లన్న ఆలయం మాత్రం ఇప్పటికీ మానవీయ విధానాలకే పరిమితమై ఉంది.
మూడు సంవత్సరాల క్రితమే హుస్నాబాద్ మండలంలోని స్వయంభూ రాజేశ్వరస్వామి ఆలయం, మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరల్లో డిజిటల్ హుండీలు ఏర్పాటు చేశారు. అయితే, ఇక్కడ మాత్రం నాలుగేళ్ల క్రితమే తెచ్చిన స్వైపింగ్ యంత్రాలను కూడా వినియోగంలోకి తేలేదే లేదు. డిజిటల్ సేవలు ప్రవేశపెడితే భక్తులకు సౌలభ్యం పెరుగుతుందని, పారదర్శకత పెరిగి అక్రమాలకు అడ్డుకట్టవేయవచ్చని భక్తులు భావిస్తున్నారు.
ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకి వస్తే, టికెట్ల రీసైక్లింగ్ లాంటి మోసాలకు తావుండదు. భక్తులు క్యూఆర్ కోడ్ ద్వారా నేరుగా విరాళాలు చెల్లించగలుగుతారు. ఆలయ గంగరేణి చెట్టు, ప్రసాదాల కౌంటర్ల వద్ద డిజిటల్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తే, భక్తులకు మరింత సౌకర్యంగా ఉంటుంది.
ఈ విషయంపై ఆలయ ఈవో రామాంజనేయులు స్పందిస్తూ, “త్వరలోనే కొమురవెల్లి మల్లన్న ఆలయానికి ప్రత్యేకంగా ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకి తెస్తాం. డిజిటల్ హుండీ ఏర్పాటుపై బ్యాంకర్లతో చర్చలు జరుపుతున్నాం,” అని తెలిపారు. భక్తుల సౌకర్యాల కోసం ఆలయ పాలకులు ఎంత త్వరగా నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి!