పార్లమెంటు ఎన్నికల తరువాత జరిగే అత్యంత కీలకమైన ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికలే. అందుకే అధికార పార్టీ కాంగ్రెస్ ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోగా.. పార్లమెంటు ఎన్నికలలో సత్తాచాటిన బీజేపీకి ఎన్నికలు మరింత కీలకంగా మారాయి. అయితే ఎప్పుడూ ఎన్నికలనగానే సై అనే బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఈసారి మాత్రం నై అనడంతో.. అధికార కాంగ్రెస్, బీజేపీతోపాటు ఇండిపెండెంట్ అభ్యర్థుల మధ్యనే పోరు నెలకొంది.
కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఫిబ్రవరి 10తో నామినేషన్ల గడుపు ముగిసింది. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు కొంతమంది ఇండిపెండెంట్లు నామినేషన్ వేశారు. ఈసారి యాభై మందికి పైగానే బరిలో ఉండే అవకాశం ఉంది. అయితే ప్రధాన ప్రతిపక్షం బీఅర్ఎస్ ఈ ఎన్నికలకు దూరంగా ఉండటంతో.. కాంగ్రెస్, బీజేపీ, ఇండిపెండెంట్ల మధ్య గట్టి పోటీ నెలకొంది.
కరీంనగర్, అదిలాబాద్, నిజామాబాదు, మెదక్ లో ఇప్పుడు జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు.. సాధారణ ఎన్నికల కంటే కూడా స్పీడుగా ప్రచారాలు చేస్తున్నారు. ఉత్తర తెలంగాణలో 45 అసెంబ్లీ స్థానాలలో ఉన్న పట్టభద్రులకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. పార్లమెంటు ఎన్నికల తరువాత జరిగే అత్యంత కీలకమైన ఎన్నికలు కావడంతో హోరాహోరీ పోటీ నెలకొంది.
సుమారుగా మూడు లక్షల యాభై ఐదు వేల ఓటర్లు ఉన్నారు. పోల్ అయిన ఓట్లలలో యాభై ఒక్క శాతం వచ్చిన వారిని విజేతగా ప్రకటిస్తారు.దీంతో మొదటి ప్రాధాన్యత ఓటు తమకే వేయాలని ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు అభ్యర్థులు. అయితే ప్రధాన పార్టీల అభ్యర్థులకు పోటీ గానే ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. అధికార పార్టీ కాంగ్రెస్ నుంచి నరేందర్ రెడ్డి, బీజేపీ నుండి అంజిరెడ్డి, ఇండిపెండెంట్లుగా ప్రసన్న హరికృష్ణ, మాజీ మేయర్ రవిందర్ సింగ్, శేఖర్ రావు తదితరులు బరిలో ఉన్నారు.
ఈ ఎన్నికల తరువాత వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలిచిన పార్టీకే స్థానిక సంస్థలలో కూడా సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉండటంతో ప్రతీ పార్టీ ఈ ఎన్నికలలో గెలుపుకోసం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి.
ఫిబ్రవవరి 27వ తేదీన జరిగే ఈ ఎన్నికల కోసం కొద్ది రోజులు మాత్రమే ఉండటంతో ప్రచారం స్పీడందుకుంది.