బీహార్ లో విచిత్ర ఘటన: సీఎం పర్యటనలో మాయమైన పూల మొక్కలు.. ఎటూ వెళ్లాయో తెలుసా?

Where Did The Decorative Flower Pots Go After Bihar CMs Visit

బీహార్‌లోని బక్సర్ జిల్లాలో సీఎం నితీష్ కుమార్ పర్యటన అనేక ఆసక్తికర ఘటనలకు వేదికైంది. ఆయన స్వాగతం కోసం అధికారులు భారీగా పూల మొక్కలు అమర్చగా, ఆయన వెళ్లిపోయిన క్షణాల్లోనే స్థానికులు వాటిని తీసుకెళ్లడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన ‘ప్రగతి యాత్ర’లో భాగంగా బక్సర్‌ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా యంత్రాంగం ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు సర్క్యూట్ హౌస్ వెలుపల రకరకాల పూల కుండీలను ఏర్పాటు చేసింది. అయితే, ముఖ్యమంత్రి వేదిక వీడి వెళ్లిపోయిన వెంటనే స్థానికులు ఒక్కసారిగా పూల మొక్కలను లూటీ చేసి తీసుకెళ్లడం వింత కలిగించింది. మహిళలు, పిల్లలు పూల కుండీలు పట్టుకుని పరుగులు పెట్టిన దృశ్యాలు భద్రతా సిబ్బందిని కూడా షాక్‌కు గురిచేశాయి.

సీఎం పర్యటన సందర్భంగా మురికివాడ ప్రాంతాల మహిళలు నిరసనకు దిగారు. అభివృద్ధి హామీలతో ప్రజలను మోసం చేస్తున్నారని, ఎన్నికల సమయంలో ఓట్ల కోసం మాత్రమే వస్తున్నారని తీవ్ర విమర్శలు గుప్పించారు. రాబోయే ఎన్నికల్లో ఓటు వేయకూడదని తాము నిర్ణయించుకున్నామని ప్రకటించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారేలోపు, సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ (SDM) జోక్యం చేసుకుని నిరసనకారులను ప్రశాంతంగా పంపారు.

రూ.202 కోట్ల నీటి సరఫరా ప్రాజెక్ట్ ప్రారంభం
ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పర్యటనలో భాగంగా బక్సర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా, 51 గ్రామాలు, 20 పంచాయతీల్లోని 36,760 గృహాలకు స్వచ్ఛమైన గంగా జలాన్ని అందించేందుకు రూపొందించిన రూ.202 కోట్ల బహుళ-గ్రామ నీటి సరఫరా ప్రాజెక్టును ఆయన ప్రారంభించారు. ఆర్సెనిక్ కాలుష్యం ప్రభావిత డయారా ప్రాంత ప్రజలకు ఇది కీలకమైన ప్రాజెక్టుగా మారనుంది.

బక్సర్‌లోని సిమ్రిలో నమూనా పంచాయతీ భవనానికి సీఎం నితీష్ కుమార్ శంకుస్థాపన చేశారు.
గోలంబార్ ప్రాంతంలో విశ్వామిత్ర హోటల్ నిర్మాణానికి పర్యాటక శాఖ ఆధ్వర్యంలో భూమిపూజ నిర్వహించారు. రామరేఖ ఘాట్‌లో రూ.13 కోట్ల ప్రాజెక్టును ప్రారంభించారు.

12 గదుల అతిథి గృహాన్ని ప్రారంభించి, అధికారులతో అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించారు.
మొత్తానికి.. సీఎం పర్యటనతో బక్సర్ జిల్లాలో అభివృద్ధి పనులు ఊపందుకున్నా, ప్రజల్లో ఆగ్రహం తగ్గలేదు. ముఖ్యమంత్రి వెళ్లిపోయిన వెంటనే అలంకరణ కోసం అమర్చిన పూల మొక్కలను స్థానికులు లూటీ చేయడం అధికార యంత్రాంగానికి పెద్ద షాక్‌గా మారింది. ఈ ఘటన సీఎం పర్యటనల్లో అధికారుల వ్యవస్థాపిత ప్రణాళికలపై ప్రశ్నలు లేవనెత్తేలా చేసింది.