ఊపందుకున్న మెట్రో విస్తరణ పనులు..

Metro Expansion Works Gaining Momentum

భాగ్యనగరంలో మెట్రో విస్తరణ పనులు వేగవంతమయ్యాయి. ప్యారడైజ్‌ టు మేడ్చల్.. జేబీఎస్ టు షామీర్‌పేట్‌కు మెట్రో అనౌన్స్‌మెంట్ తర్వాత డీపీఆర్ సిద్ధం చేసే పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు. దీనిలో భాగంగా ట్రాఫిక్ సర్వే, భూసామర్థ్యం, పర్యావరణంపై ప్రభావంపై అధ్యయన ప్రక్రియలు కొనసాగుతున్నాయి. జేబీఎస్ నుంచి మేడ్చల్ 24 కిలోమీటర్లు, జేబీఎస్ నుంచి శామీర్ పేట్ 21 కిలోమీటర్లు మెట్రో కారిడార్‌లకు డీపీఆర్‌ల కోసం అవసరమైన సర్వే పనులు వేగంగా సాగుతున్నాయి. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో లిమిటెడ్ డీపీఆర్‌ల తయారీకి ట్రాఫిక్ సర్వే, భూసామర్థ్య పరీక్షలు, పర్యావరణ ప్రభావ అధ్యయనం చేయాలని అధికారులు గుర్తించారు.

ట్రాఫిక్ సర్వేకు సంబంధించిన అధ్యయనంలో ప్రతిపాదిత కారిడార్లలో డైలీ ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య, భవిష్యత్తులో వారి ప్రయాణ అవసరాలు, జంక్షన్ల వద్ద ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు తీసుకునే టర్నింగులు, వాహన ప్రయాణికుల్లో మెట్రో ట్రైనుకు మారే అవకాశాలు, మెట్రో స్టేషన్లు ఏర్పాటయ్యే ప్రదేశాల్లో ప్రయాణికుల రద్దీ వంటి అంశాలను పరిశీలించనున్నారు.

ప్రాజెక్ట్ పర్యావరణ ప్రభావ అధ్యయనంలో.. ప్రస్తుతం ఈ మార్గాలలో ఉన్న గాలి ప్యూరిటీ, గాలిలో ఉన్న ధూళికణాల శాతం, కాలుష్య కారకాల నిర్ధారణ, సౌండ్ పొల్యూషన్, నీటి వనరులు, వృక్ష, జంతుజీవాల జీవ వైవిధ్యం, దినసరి కూలీలపై ప్రాజెక్టు ప్రభావం వంటి అంశాలను అధికారులు పరిశీలిస్తారు. ప్రతీ అర కిలోమీటర్ కి ఒక బోర్ హోల్ చొప్పున ..ఒక్కొక్క బోర్ హోల్‌ను 50 అడుగుల లోతు వరకు డ్రిల్లింగ్ చేసి, భూమి అంతరపొరల గట్టితనాన్ని పరిశీలిస్తారు.

ఇప్పటికే హెచ్ఎండీఏ , నేషనల్ హైవే సంస్థలు కొన్ని భూ సామర్థ్య అధ్యయనాలు చేపట్టారు. ప్రస్తుతం మెట్రో కంపెనీ జేబీఎస్ టు మేడ్చల్ రూట్‌లో 25 చోట్ల, జేబీఎస్ టు శామీర్ పేట్ మార్గంలో 19 చోట్ల భూసామర్థ్య టెస్టులు నిర్వహిస్తున్నారు. మేడ్చల్ మార్గంలో 14 చోట్ల, శామీర్ పేట్ రూట్‌లో 11 చోట్ల ఇప్పటికే పరీక్షలు పూర్తవగా..ఫిబ్రవరి నెలాఖరులోగా అన్నిప్రాంతాల్లోపరీక్షలు పూర్తవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ప్రయాణించే విధంగా మెట్రో కారిడార్లను నిర్మించడానికి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మార్చి నెలలో ఈ రెండు రూట్‌లతోపాటు.. ఫోర్త్ సిటీ డీపీఆర్ సిద్దం చేసి ప్రభుత్వానికి రిపోర్ట్ అందిస్తారు.