ఈ మధ్య బంగారం ధరలు పెరగడమే కాని తగ్గడమే కనిపించలేదు. మన భారతీయ సాంప్రదాయంలో బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఉండటంతో..ప్రతీ శుభకార్యానికి బంగారం కొనడం అలవాటు చేసుకున్నారు. అయితే 13 నెలలుగా బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే షాకవడం మాత్రం గ్యారంటీ. కొన్ని నెలలుగా బంగారం ధరలు పెరుగుతున్న తీరుతో కంపేర్ చేస్తే మాత్రం త్వరలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. లక్ష దాటే అవకాశం ఉందని తెలుస్తోంది. 13 నెలల గురించి పరిశీలిస్తే.. కొన్ని నెలల్లో బంగారం ధరల్లో విపరీతమైన పెరుగుదల కనిపించింది.
జనవరి 21, 2024న 24 క్యారెట్ల బంగారం స్వచ్ఛమైన 10 గ్రాముల ధర సుమారు 63,000 రూపాయలుగా ఉంది. అదే సమయంలో ఫిబ్రవరి 21, 2025 నాటికి ఈ ధర 10 గ్రాములకు 88,223 రూపాయలకి పెరిగింది. అంటే 25వేల223 వరకు పెరిగింది. ఇది దాదాపు 40 శాతం పెరుగుదల ఉంది. ఫిబ్రవరి 21న సాయంత్రం 6 గంటల సమయానికి 10 గ్రాముల బంగారం ధర 88,216 రూపాయలుగా ఉంది.
ప్రపంచ మార్కెట్లలో పెరుగుదల, భారతదేశంలో డిమాండ్ పెరగడం వల్లే గోల్డ్ ఈ రేంజ్లో పెరిగాయని నిపుణుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఔన్సుకు 2,000 దాటాయి. ఇది కాకుండా ట్రంప్ సుంకాల వల్ల, పెరుగుతున్న వాణిజ్య యుద్ధం ముప్పు వల్ల, పెట్టుబడిదారులు తమ డబ్బును బంగారంలో పెట్టుబడి పెడుతున్నారు. దీని వల్లే ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ సమయంలో ఎవరైనా బంగారంలో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే, మార్కెట్ ధోరణులను గమనించి సరైన సమయంలో పెట్టుబడి పెట్టాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. బంగారం ఎల్లప్పుడూ సురక్షితమైన పెట్టుబడి ఎంపికేనని.. కాకపోతే ధరలలో హెచ్చు తగ్గులను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాలని సూచిస్తున్నారు.