శివుడికి ఎంతో ప్రీతికరమైన పర్వదినంగా మహాశివరాత్రిని భావిస్తారు. శివుడికి అభిషేకాలు చేసి..ఉపవాసం ఉండటమే కాకుండా.. భక్తులు రాత్రంతా జాగరణ చేస్తారు. శివనామ స్మరణతో రోజంతా గడుపుతారు. మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండటం వల్ల జీర్ణక్రియ బాగుంటుందని శాస్త్రాలు, పురాణాలు చెబుతున్నాయి. ఉపవాసం ఆధ్యాత్మికంగా స్థిరంగా ఉంచడంతో పాటు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. ఇది మనిషిని నిశ్చలంగా ఉంచడానికి, మనసును శుద్ధి చేయడానికి చక్కగా పని చేస్తుందని పురాణాలు చెబుతాయి.
శివరాత్రికి నిర్జల ఉపవాసం చేస్తే.. 24 గంటల పాటు ఆహారం, నీరు కూడా తీసుకోకూడదు. అయితే ఆరోగ్యం సహకరిస్తేనే ఈ ఉపవాసం చేయాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఒకవేళ జల ఉపవాసం చేస్తే మాత్రం రోజంతా ఆహారం లేకుండా నీరు మాత్రమే తాగాలి. అలాగే ద్రవ ఉపవాసం చేసేవారయితే ఈ ఉపవాసంలో టీ, కొబ్బరి నీరు, నిమ్మకాయ నీరు మాత్రమే తీసుకుంటారు. ఇక కొంతమంది పాలు, పండ్ల ఉపవాసం చేస్తారు. వీరు పాలు, పండ్లు, పెరుగు, మజ్జిగ, గింజలు మొదలైనవి తీసుకోవచ్చు. సాత్వికాహార ఉపవాసం కూడా కొంతమంది చేస్తారు. ఆరోగ్యం బాగా లేకపోతే సగ్గుబియ్యం, మఖానా, డ్రై ఫ్రూట్స్, ఉడకబెట్టిన బంగాళాదుంపలు వంటి తేలికపాటి సాత్వికాహారాన్ని ఉప్పు లేకుండా తినాలి.
ఉపవాసం రోజు శక్తి తగ్గకుండా ఉండాలంటే శారీరక శ్రమను తగ్గించాలి. ధ్యానం, మంత్రోచ్ఛారణ, ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడంలో సమయం గడిపితే మంచిది.హైపర్ టెన్షన్ లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉంటే ఉపవాసం చేయకూడదు. రక్తపోటు ఉన్నవారు పండ్లు, పాలు తీసుకునే ఉపవాసాన్ని ఎంచుకోవడం మంచిదని డాక్టర్లతో పాటు పండితులు కూడా చెబుతున్నారు. అలాగే మానసిక ప్రశాంతత కోసం ఓం నమః శివాయ మంత్రాన్ని జపించి.. ధ్యానం చేయాలి. ఆధ్యాత్మిక శుద్ధి కోసం శివునికి బిల్వ పత్రాలు, నీరు, పాలు సమర్పించాలి. రాత్రి జాగరణ చేసి మెలకువగా ఉండటానికి ధ్యానం ఉపయోగం ఉంటుంది. ఉపవాసం వల్ల శక్తి తగ్గకుండా ఉండాలంటే ఉపవాసానికి ముందు రోజు రాత్రి పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న కొవ్వు, ప్రోటీన్లు ఎక్కువగా ఉన్న నెయ్యి, పనీర్, పెరుగు, కొబ్బరి, పండ్లు వంటివి తీసుకుంటే మంచిది.