2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను నభూతో నభవిష్యతి అనే రీతిలో అట్టహాసంగా నిర్వహించడానికి ఏపీ ప్రభుత్వం ముందుగానే ప్రణాళికలు వేస్తోంది. దీనిలో భాగంగా, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ నేతృత్వంలో ప్రయాగ రాజ్‌లో జరుగుతున్న కుంభమేళా ఏర్పాట్లను అధ్యయనం చేస్తున్నారు. ప్రయాగ రాజ్‌లో జరుగుతున్న కుంభమేళా ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించడానికి మంత్రి నారాయణ ఆద్వర్యంలో మున్సిపల్ శాఖ డైరెక్టర్ సంపత్ కుమార్, రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్ సోమవారం ఉదయం ప్రయాగ రాజ్ చేరుకున్నారు. అక్కడి భారీ ఏర్పాట్లను స్వయంగా పరిశీలించడానికి ప్రత్యేక బృందంగా ఏర్పడి, వివిధ విభాగాల అధికారులతో సమావేశమయ్యారు.
మంత్రి నారాయణ బృందం కుంభమేళా అధారిటీ ఆఫీసును సందర్శించగా.. కుంభమేళా ఆఫీసర్ విజయ్ కిరణ్ ఆనంద్.. కుంభమేళా నిర్వహణకు సంబంధించిన కీలక అంశాలను ఏపీ బృందానికి వివరించారు. కుంభమేళాలో జరిగే అంతర్రాష్ట్ర కదలికలు, భద్రతా చర్యలు, ఘాట్‌ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు, కమాండ్ కంట్రోల్ వ్యవస్థ, ట్రాఫిక్ నియంత్రణ, రద్దీ నిర్వహణ, తాగునీరు, పారిశుద్ధ్య ఏర్పాట్లు వంటి పలు అంశాలపై ప్రెజెంటేషన్ ఇచ్చారు. అనంతరం కుమార్య ఘాట్, త్రివేణీ సంగమం, మహాదేవి ఘాట్ ప్రాంతాల్లో చేపట్టిన భద్రతా చర్యలను పరిశీలించిన ఏపీ బృందం, భవిష్యత్తులో గోదావరి పుష్కరాల్లో ఇటువంటి అధునాతన పద్ధతులను అనుసరించడానికి మొగ్గు చూపించింది.
అలాగే ప్రధాన ఘాట్‌ల వద్ద భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, భక్తులకు అందుతున్న సౌకర్యాల గురించి కూడా అక్కడి అధికారులతో మంత్రి నారాయణ సమీక్షించారు. పుష్కరాల సమయంలో కోట్లాదిమంది భక్తులు గోదావరి పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. కాబట్టి.. రద్దీ నియంత్రణ, ఎమర్జెన్సీ సేవలు, వరద ప్రవాహ నియంత్రణ, డిజిటల్ సర్వీల గురించి ఏపీ బృందం లోతుగా అధ్యయనం చేసింది. రెండు రోజుల ప్రయాగ్ రాజ్ పర్యటన ముగిసిన తర్వాత మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ.. గోదావరి పుష్కరాలు -కుంభమేళాకు సమానమైన వేడుక. భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని, అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఏర్పాట్లు చేస్తామని అన్నారు.అంతేకాకుండా ప్రత్యేకంగా ట్రాఫిక్ కంట్రోల్, కమాండ్ కంట్రోల్ వ్యవస్థ, భద్రతా ఏర్పాట్లలో ఉత్తమ విధానాలను కూడా అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం సంకల్పించిందని నారాయణ వివరించారు.