
15 ఏళ్లకు పైబడిన వాహనాలను కలిగినవారికి షాకిచ్చే నిర్ణయం తీసుకుంది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఢిల్లీలోని పెట్రోల్ బంకులు మార్చి 31 తర్వాత ఈ పాత వాహనాలకు ఇంధనం అందించకుండా నిరాకరించనున్నాయి. కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా, పెట్రోల్ బంకుల్లో ప్రత్యేక గాడ్జెట్లు అమర్చి 15 ఏళ్లు పైబడిన వాహనాలను గుర్తించనున్నారు.
కఠిన నిబంధనల అమలు
దిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు పర్యావరణ శాఖ కఠిన నిర్ణయాలను అమలు చేయనుంది. పాత వాహనాలకు ఫిట్నెస్ టెస్టు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. పోలీసులు, ట్రాఫిక్ శాఖతో కలిసి వీటిని కఠినంగా అమలు చేయాలని నిర్ణయించారు.
తుక్కు విధానం ద్వారా పాత వాహనాలను తొలగించి, ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించే చర్యలు చేపట్టనున్నారు.
యాంటీ స్మోగ్ గన్లు – కొత్త ప్రణాళికలు
దిల్లీలో కాలుష్య నియంత్రణ చర్యలలో భాగంగా, ఎత్తైన భవనాలు, హోటళ్లు, వాణిజ్య సముదాయాల్లో యాంటీ స్మోగ్ గన్లను ఏర్పాటు చేయనున్నారు. 90% సీఎన్జీ బస్సులను తగ్గించి, ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టే ప్రణాళిక సిద్ధమైంది. పర్యావరణ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ఈ చర్యల ద్వారా కాలుష్యాన్ని తగ్గించడం, పాత వాహనాలను నియంత్రించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా ఉంది.