ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక..వైసీపీ పరిపాలన కాలంలో జరిగిన ఘటనలపై దృష్టి సారించింది. ముఖ్యంగా టీడీపీ ఆఫీసుపై జరిగిన దాడిని సీరియస్ గా తీసుకుంది. అయితే ఈ కేసులో వల్లభనేని వంశీ ప్రమేయం ఉందని ఏపీ పోలీసులు భావిస్తున్నారు. టీడీపీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ సత్య వర్ధన్ ఇచ్చిన ఫిర్యాదుతో.. ఏపీ పోలీసులు ఇటీవల హైదరాబాద్ లోని రాయదుర్గం ప్రాంతంలో వల్లభనేని వంశీని అరెస్టు చేసి..విజయవాడ జైల్లో విచారణ ఖైదీగా ఉంచారు.
మరోవైపు వల్లభనేని వంశీ జైల్లో ఉండగానే.. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు టీడీపీ, జనసేన నేతలు ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో హైదరాబాదులోని రాయదుర్గం ప్రాంతంలోని మై హోమ్ బూజ అపార్ట్మెంట్లో పోసాని కృష్ణమురళిని పోలీసులు అరెస్టు చేశారు. తర్వాత ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి.. రైల్వే కోడూరు ప్రధాన న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టగా.. పోసానికి 14 రోజులపాటు రిమాండ్ విధించింది కోర్టు.
పోసాని కృష్ణ మురళికి బెయిల్ ఇవ్వాలని వైసీపీ తరఫున న్యాయవాది పొన్నవోలు సుధాకర్ వాదించినా కూడా ఉపయోగం లేకుండా పోయింది. అయితే పోసానిని పోలీసులు విచారణ చేస్తుండగా ..తాను సజ్జల రామకృష్ణారెడ్డి, భార్గవ్ రెడ్డి చెప్పినట్టుగానే చేశానని.. అందుకే ప్రెస్ట్ మీట్లో తాను విమర్శలు చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. దీంతో వెంటనే అలర్ట్ అయిన సజ్జల రామకృష్ణారెడ్డి, భార్గవ్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. అంతేకాదు తమను అరెస్టు చేయకపోతే విచారణకు సహకరిస్తామని చెప్పారు. ఈ వ్యవహారం ఇలా సాగుతుండగానే సోమవారం పోసాని, వల్లభనేని వంశీ వ్యవహారంలో మరో కీలక అడుగు వేసిన ఏపీ పోలీసులు… సరికొత్త అస్త్రంా పీటీ వారెంట్ ను బయటకి తీశారు.
పోసాని కృష్ణ మురళి, వల్లభనేని వంశీ వ్యవహారంలో ఏపీ పోలీసులు సోమవారం ఫ్రిజనర్ ట్రాన్సిట్ వారెంట్లు దాఖలు చేశారు. ఒక కేసులో అరెస్టయి అప్పటికే జైల్లో ఉన్న విచారణ ఖైదీని.. మరొక కేసులో విచారించడానికి ఇతర ప్రాంతానికి తీసుకెళ్లి విచారించడానికి పోలీసులు కోర్టు అనుమతి తీసుకోవాలి. ఇలా అనుమతి తీసుకోవడానికి జైలు అధికారులకు అందించే పత్రాలనే పీటీ వారెంట్ అంటారు. అయితే కేవలం టీడీపీ ఆఫీసుపై దాడి, చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ పై చేసిన అనుచిత వ్యాఖ్యల కేసులు మాత్రమే కాకుండా.. వైసీపీకి సంబంధించిన ఇతర విషయాలను కూడా వల్లభనేని వంశీ, పోసాని కృష్ణ మురళి ద్వారా బయటకు రాబెట్టాలని ఏపీ పోలీసులు భావిస్తున్నట్టు తెలుస్తోంది.