ప్రతి సంవత్సరం మద్యం అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రభుత్వాలు ధరలను పెంచినా, మద్యం వినియోగం మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం మద్యం విక్రయాలు రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రధాన ఆదాయ వనరుగా మారాయి. ఈ అమ్మకాల ద్వారానే ప్రభుత్వ ఖజానాలో భారీగా ఆదాయం జమవుతోంది. ఈ పరిస్థితుల్లో మద్యం నిషేధానికి ప్రభుత్వాలు మొగ్గు చూపే అవకాశాలు చాలా తక్కువ.
దేశవ్యాప్తంగా మద్యం వినియోగం పెరుగుతుండగా, బీహార్లో మాత్రం మద్యపాన నిషేధం అమల్లో ఉంది. కానీ, ఇతర రాష్ట్రాల్లో మద్యం వినియోగం నియంత్రణకు ఎటువంటి ముఖ్యమైన చర్యలు తీసుకోవడం లేదు. ముఖ్యంగా మారుతున్న జీవనశైలి, పాశ్చాత్య ప్రభావం, ఒత్తిడి వంటి అంశాల ప్రభావంతో యువత మద్యం వైపు ఆకర్షితమవుతున్నారు. గతంలో పురుషులే ఎక్కువగా మద్యం సేవించేవారు. కానీ, ప్రస్తుతం మహిళలు కూడా మద్యం సేవించే వారి సంఖ్య పెరుగుతోంది.
తాజా సర్వే ప్రకారం, భారతదేశంలో మహిళలు అత్యధికంగా మద్యం సేవించే రాష్ట్రంగా అస్సాం నిలిచింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నిర్వహించిన అధ్యయనం ప్రకారం, దేశవ్యాప్తంగా సగటున 15-49 సంవత్సరాల వయస్సులోని 1.2 శాతం మంది మహిళలు మద్యం సేవిస్తున్నట్లు వెల్లడైంది. అస్సాంలో ఈ శాతం 16.5 కి చేరుకుంది. దీనికి ప్రధాన కారణంగా మారుతున్న జీవన విధానం, ఒత్తిడి, సామాజిక స్వేచ్ఛ అనే అంశాలు చెప్పొచ్చు.
అస్సాం తర్వాత, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ వంటి ఈశాన్య రాష్ట్రాల్లో కూడా మద్యం సేవించే మహిళల సంఖ్య గణనీయంగా ఉంది. మారుతున్న జీవనశైలిని దృష్టిలో ఉంచుకుని, మద్యం వినియోగం నియంత్రణ కోసం ప్రభుత్వాలు మరింత కఠిన చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.