వైసీపీ ప్రభుత్వ హయాంలో చాలా మంది రెచ్చిపోయారు. శృతి మించి బోర్డర్లు క్రాస్ చేసి మరీ మాట్లాడారు. నటుడు పోసాని కృష్ణ మురళి అయితే నోరా తాటిమట్టా అనేటట్టుగా హద్దులు దాటి మరీ చెలరేగిపోయారు. తాజాగా ఇలాంటివారందికీ వరుసగా ఝలక్ ఇచ్చే పనిలో పడింది ఏపీ ప్రభుత్వం.
అలా ఇటీవల అరెస్ట్ అయిన పోసాని కృష్ణమురళికి..రోజుకోరకంగా చుక్కలు చూపిస్తున్నారు ఏపీ పోలీసులు. గతంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్‌పై పోసాని కృష్ణ మురళి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దానిపై టీడీపీ, జనసేన నేతల నుంచి ఫిర్యాదులు రావడంతో ఏపీ పోలీసులు హైదరాబాద్‌లో పోసాని కృష్ణమురళిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు.
అయితే ఇలా పోసాని కృష్ణమురళి పై ఒకటి కాదు రెండు కాదు దాదాపు 17 కేసులు నమోదయ్యాయి. ఒక్కొక్క కేసులో రిమాండ్ నుంచి బయటకు వస్తుండగా.. మరో కేసు నమోదవుతుండటంతో.. కోర్టులో హాజరు పరిచి మళ్లీ రిమాండ్ కు తరలిస్తున్నారు. దీంతో పోసాని ఇప్పట్లో బయటకు వచ్చే ఛాన్స్ లేదని చేసుకున్నవాళ్లకు చేసుకున్నంత అంటూ సెటైర్లు వినిపిస్తున్నాయి.
తాజాగా పోసానికి కర్నూలు జిల్లా కోర్టు 14 రోజుల రిమాండ్ రిమాండ్ విధించింది. పోసానిపై కర్నూలు జిల్లా ఆదోని మూడో పట్టణ పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదు అయింది. అయితే ఇప్పటికే గుంటూరు జిల్లాలో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసానిని పీటీ వారెంటుతో ఆదోని పోలీసులు వచ్చి పోసానిని తమకు అప్పగించాలని జైలు సిబ్బందిని కోరారు. వారు అనుమతి ఇవ్వడంతో అదుపులోకి తీసుకొని వైద్య పరీక్షల అనంతరం కర్నూలుకు తరలించి కోర్టులో హాజరు పరిచారు. రెండుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి పోసాని కృష్ణకి 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
అయితే కర్నూలు కోర్టు కూడా తనకు 14 రోజులపాటు రిమాండ్ విధించడంతో బాగా టెన్షన్ పడ్డ. పోసాని కృష్ణ మురళి. తనకు ఆరోగ్యం సరిగా లేదని.. కర్నూలు హెడ్ క్వార్టర్స్ లోనే ఉంచాలని జడ్జిని కోరినా ఫలితం దక్కలేదు. పోసానిని పోలీసులు కర్నూలు జిల్లా కారాగారానికి తరలించారు. ఈనెల 18 వరకు రిమాండ్ లోనే ఉండనున్నారు.కాగా మార్చి 4న పోసాని క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అసలు తనపై వేసిన కేసులు సరైనవి కావని.. వెంటనే కొట్టేయాలని కోరారు.