కొంతమందిని ఓవర్ వెయిట్ ఇబ్బందిపెడితే..మరికొందరిని అండర్ వెయిట్ పరేశాన్ చేస్తుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. బరువు పెరగరు. అయితే ఆరోగ్య కరంగా బరువు పెరగాలనుకునే వారికోసం ప్రత్యేకంగా డైట్ ప్లాన్ సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ముందుగా వీరు వ్యాయామం చేయాలి. వ్యాయామం అంటే అందరూ అధిక బరువు ఉన్నవారు చేస్తారని అనుకుంటారు. కాని బలహీనంగా ఉండే వాళ్లు ఎక్సర్ సైజ్ చేయడం వల్ల వారిలో ఆకలి పెంచడానికి సహకరిస్తుంది. ఉదయం నిద్రలేచిన వెంటనే వ్యాయామం చేయడం వల్ల శరీర కండరాలు కూడా అభివృద్ధి చెందుతాయి. ఇలా రెగ్యులర్ చేస్తే రెండు, మూడు నెలల్లోనే వారు కావాలనుకున్న బరువును పొందొచ్చు.
ఆరోగ్యకరమైన శరీరం కోసం అవసరమైన శక్తిని అందించడానికి బ్రేక్ ఫాస్ట్ చాలా ఇంపార్టెంట్. దీనిలో హెల్దీ ప్రోటీన్లు కార్బోహైడ్రేట్లు ఫైబర్లు, తృణధాన్యాలు ఉండేలా చూసుకోవాలి. బ్రేక్ ఫాస్ట్ లో ముఖ్యంగా రోజుకు రెండు గుడ్లు తినడం మంచిది. గుడ్డులో ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి.
బ్రెడ్ తో పాటు వెన్న చీజ్, బట్టర్ తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన కొవ్వు అందుతుంది. వీటితో పాటు రాత్రి నానబెట్టిన బాదాంలు, కిస్ మిస్, ఖర్జూరాలు, జీడిపప్పు కూడా తీసుకోవాలి. బ్రేక్ ఫాస్ట్ లో కొంతమంది పెరుగన్నం తింటారు. ఇలాంటివారు రాత్రి అన్నంలో పాలు వేసి తోడుపెట్టి అందులో కాస్త జీరా, కాస్త అల్లం ముక్కలు వేసి ఉదయం తింటే మంచి ఫలితం ఉంటుంది. నెలరోజుల్లోనే మార్పు కనిపిస్తుంది.
బ్రేక్ ఫాస్ట్ తిన్న రెండు మూడు గంటల తరువాత స్నాక్స్ తినడం బరువు పెరగాలనుకునేవారికి మంచిది. మజ్జిగ కూడా తీసుకుంటే మంచిది. బటర్ మిల్క్ ఆకలి పెరిగేలా చేస్తుంది. దీనివల్ల ఎక్కువగా తినేందుకు అవకాశం ఉంటుంది. మధ్యాహ్నం భోజనంలో రోటి, నెయ్యితో తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. కూరగాయలలో బీన్స్, బంగాళాదుంపలు వంటివి తీసుకోవాలి. ఎక్కువ కేలరీలు ఉన్న ఆహారం తీసుకోవడం వలన ఈజీగా బరువు పెరుగుతారు. అన్నం తినడం వల్ల కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా లభిస్తాయి. రోటీతో ఒక కప్పు పప్పు లేదా చికెన్ తీసుకోవచ్చు.
సాయంత్రం స్నాక్స్ తీసుకోవడం చాలా మంచిది. వీటిని తినడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్న బంగాళదుంపతో చేసిన చిరుతిళ్లు, చికెన్ శాండ్విచ్, బటర్ తో చేసిన ఆహారం తినడం వల్ల వేగంగా బరువు పెరుగుతారు. రాత్రి తీసుకునే భోజనం శరీర పెరుగుదలకు చాలా సహకరిస్తుంది. డిన్నర్ లో ప్రొటీన్లు, కొవ్వు అధికంగా ఉండే పదార్థాలు తీసుకోవాలి. రాత్రి పడుకోబోయే ముందు ప్రతి రోజూ ఒక గ్లాసు పాలు తాగడం వల్ల బరువు పెరుగుతారు.