బెట్టింగ్‌ యాప్స్‌ కేసులో పోలీసుల దూకుడు.. పరారీలో ఆ ఇద్దరు..

డబ్బుల కోసం ఆన్ లైన్ బెట్టింగ్‌ యాప్స్‌‌ను ప్రమోట్‌ చేసి, యూత్‌ ఎమోషన్స్‌తో ఆడుకుని, వాళ్ల జీవితాలు నాశనం అయ్యేలా చేసిన సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లపై పోలీసులు పంజా విసురుతున్నారు. దీనిలో భాగంగా యూట్యూబర్లు విష్ణుప్రియ, టేస్టీ తేజను మంగళవారం విచారణకు పిలవగా.. షూటింగ్‌లో ఉన్నాం.. మీడియా ఉందన్న సాకుతో వాళ్లు విచారణకు రాలేమన్నారు.

కాగా వాళ్లిద్దరి తరుఫున రంగంలోకి దిగిన ఆర్జే శేఖర్‌ భాషా..వారికి మరికొంచెం సమయం కావాలని పోలీసులను కోరారు. దీంతో వాళ్లకు పోలీసులు వారిద్దరికీ మరో మూడు రోజుల సమయం ఇచ్చారు. అయితే అందరికీ షాక్ ఇస్తూ నిన్న రాత్రే టేస్టీ తేజా విచారణకు హాజరయ్యారు.

బెట్టింగ్‌ యాప్స్ ప్రమోషన్‌కు సంబంధించి…. విష్ణుప్రియ, టేస్టీ తేజతో పాటు రీతూ చౌదరి, హర్షసాయి, సుప్రీత, పరేషాన్‌ బాయ్స్‌ ఇమ్రాన్‌, కానిస్టేబుల్ కిరణ్‌గౌడ్, బయ్యా సన్నీ యాదవ్‌, లోకల్‌బాయ్‌ నాని, రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌, శ్యామలపైన కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే నోటీసులు ఇచ్చిన వాళ్లలో కొంతమంది తమ ఫోన్లు స్విచ్చాఫ్‌ చేయడంతో వాళ్ల ఆచూకి తెలుసుకోవడం కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

పరేషాన్‌ బాయ్స్‌ ఇమ్రాన్‌ను త్వరలోనే పోలీసులు అరెస్ట్‌ చేసే అవకాశం కనిపిస్తోంది. దీనికితోడు ఇమ్రాన్‌ వీడియోలు జుగుప్సాకరంగా ఉన్నాయంటూ పోలీసులు ఆరోపిస్తున్నారు. ఇక యూనిఫాంలో బెట్టింగ్‌ యాప్స్‌ని ప్రమోట్‌ చేసిన కానిస్టేబుల్ కిరణ్‌గౌడ్‌పైన కూడా పోలీసు కేసు నమోదైంది. లోకల్‌ బాయ్‌ నాని అరెస్టవ్వగా.. బయ్యా సన్నీ యాదవ్‌ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌పై దర్యాప్తు ముమ్మరం చేసిన హైదరాబాద్ పోలీసులు.. ఇప్పటికే పదకొండు మంది ఇన్‌ఫ్లూయెన్సర్లకు నోటీసులిచ్చారు. అయితే.. వీరిలో పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్, హర్షసాయి దుబాయ్‌కి పరారైనట్లు తెలుస్తోంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్న వారి నుంచి నిర్వాహకుల గురించి ఆధారాలను సేకరించే పనిలో పోలీసులు పడ్డారు.