ఖర్బూజా కంటే మస్క్ మిలాన్‌గానే ఎక్కువ పరిచయమున్న ఈ ఫ్రూట్ సమ్మర్‌లో ఎక్కువగా దొరుకుతుంది. వేసవిలో శరీరాన్ని చల్లబరచడమే కాకుండా..దీనిని తినడం వల్ల దాహం కూడా బాగా తీరుతుంది. ఎక్కువగా నీటి శాతం ఉండటం వల్ల, వేసవి తాపాన్ని తట్టుకునే శక్తిని ఇస్తుంది. బాడీకి అవసరమైన పోషకాలను అందిస్తూ.. జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో కూడా ఇవి సహాయపడతాయి..
మస్క్ మిలాన్‌లో విటమిన్ ఇ,జింక్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ఫైబర్ వంటి చాలా పోషకాలు ఉంటాయి. శరీరానికి అవసరమైన పోషణను అందించడమే కాకుండా జీర్ణవ్యవస్థ పని తీరును మెరుగుపరచడంలో ఇవన్నీ సహాయపడతాయి. అయితే కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లు మాత్రం ఖర్భూజా అస్సలు తినకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
డయాబెటిస్ ఉన్నవారు ఖర్భూజా ను అప్పుడప్పుడూ కొద్ది మొత్తంలోనే తినాలి. ఎందుకంటే ఈ పండు గ్లైసెమిక్ ఇండెక్స్ 60-80 మధ్య ఉంటుంది. దీంతో మస్క్ మిలాన్ ఎక్కువగా తీసుకుంటే, రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే ప్రమాదం ఉంటుంది. అలాగే అలెర్జీలు లేదా చర్మ సమస్యలతో బాధపడేవారు కూడా ఖర్బూజాను తినకూడదని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే కొంతమందికి ఈ పండు తిన్న వెంటనే కొందరిలో దద్దుర్లు, దురద, వాపు వంటివి కనిపిస్తాయి.
పేగు సమస్యలు, గ్యాస్, ఉబ్బరం, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ ఉన్నవారు కూడా మస్క్ మిలాన్‌ను తినకూడదని నిపుణులు చెబుతున్నారు. ఈ పండులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల, జీర్ణక్రియపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో.. ప్రేగులలో వాయువును పెంచి, అసౌకర్యాన్ని కలిగిస్తుంది. కిడ్నీ సమస్యలతో బాధపడేవారు కూడా దీనిని తినకూడదట. ఇందులోని అధిక పొటాషియం కంటెంట్ మూత్రపిండాల పనితీరును ప్రభావితం చేస్తాయి. దీనివల్ల మూత్రపిండాలు సరిగ్గా పనిచేయవు. దీంతో బాడీలో పొటాషియం పేరుకుపోయి ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది.