ఓ మహిళ అవయవ దానం చేయడంతో.. మరొకొందరి ప్రాణం నిలబడింది. ఈ మహత్తర కార్యానికి మంత్రి నారా లోకేష్ సహకారం తోడవడంతో.. విజయవంతంగా అవయవాల తరలింపు పూర్తయింది. గుంటూరు రమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చెరుకూరి సుష్మ అనే మహిళకు బ్రెయిన్ డెడ్ అయింది. అయితే మొదటి నుంచీ కూడా అవయవదానంపై అవగాహన ఉన్న సుష్మ..దీనికోసం రిజిస్టర్ కూడా చేయించుకుంది.
దీనికి తోడు రమేష్ హాస్పిటల్‌లోని డాక్టర్లు సుష్మ కుటుంబ సభ్యులకు, సుష్మ భర్త శ్రీనివాస్‌కు అవయవ దానానికి ఒప్పించడంతో.. వారంతా సుష్మ అవయవ దానానికి అంగీకరించారు. ఈ విషయాన్ని డాక్టర్లు మంత్రి నారా లోకేష్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి..సుష్మ అవయవాలు తరలించి మరికొందరికి ప్రాణదానం చేయడానికి అవకాశం కల్పించాలని కోరారు. దీనికి వెంటనే మంత్రి లోకేష్ స్పందించడంతో ఇప్పుడు ఆయన తీరుపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
సుష్మ అవయవాలను తరలించడానికి రవాణా ఖర్చులను నారా లోకేష్ సొంతంగా పెట్టుకున్నారు. బ్రెయిన్ డెడ్ అయిన మహిళ గుండెను తిరుపతిలోని ఆసుపత్రి చేరే వరకు కూడా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయాలని మంత్రి లోకేష్ ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో గుంటూరు నుంచి తిరుపతికి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి గుండెను తరలించారు. ముందుగా గుంటూరు నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఆ గుండెను తరలించిన అధికారులు..అక్కడ నుంచి స్పెషల్ ఫ్లైట్‌లో రేణిగుంట ఎయిర్ పోర్టుకు తరలించారు. రేణిగుంట నుంచి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి సురక్షితంగా ఆ గుండెను తిరుపతి ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రత్యేక విమాన ఖర్చులను మంత్రి లోకేష్ భరించారు. అయితే ఈ విషయంలో మంత్రి లోకేష్ తీసుకున్న ఈ చొరవతో ఇప్పుడు అందరి అభినందనలు అందుకుంటున్నారు.
ఏపీ వ్యాప్తంగా అవయవ దానంపై అవగాహన కార్యక్రమాలు పెంచడానికి కూటమి ప్రభుత్వం భావిస్తోంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే లోకేష్ చూపిన చొరవ అందరినీ ఆకట్టుకుంది. ఇప్పటికే ఏపీలో చాలా చోట్ల స్వచ్ఛంద సేవా సంస్థలు అవయవ దానంపై అవగాహన కల్పిస్తున్నాయి. దీనికి ఇలా ప్రభుత్వ సహకారం కూడా తోడైతే ఇది ప్రజల్లోకి బలంగా వెళ్లే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.