తలలో ఉండే చర్మం వాతావరణం నుంచి తనను తాను రక్షించుకోవడానికి ఒక రకమైన జిగురులాగా ఉండే కొన్ని పదార్థాన్ని వదులుతూ ఉంటుంది. దీనివలన చర్మం మెత్తగా ఉంటుంది. అయితే తలలోని ఈ జిగురు.. గాలి సరిగా తగలక, హెడ్ బాత్ లేకపోవడంతో పెచ్చులు పెచ్చులుగా మారి చుండ్రుగా తయారవుతుంది. షాంపూలు తరచుగా వాడేవారికి కూడా అందులో కెమికల్స్ చర్మం పైపొరను పాడు చేసి ఎక్కువ పొట్టు రాలేట్లు చేస్తాయి. షాంపు పెట్టిన రోజున బాగానే ఉంటుంది. కాని తరువాత రోజునుంచి అసలు ప్రతాపం చూపిస్తుంది. కొన్ని చిట్కాలతో ఈ డేండ్రఫ్ కు చెక్ పెట్టొచ్చని డెర్మటాలజిస్ట్ లు చెబుతున్నారు.
ప్రతిరోజు చన్నీళ్లతో తల స్నానం చేయాలి. వేడినీళ్ల తలకు పోయకూడదు. నీళ్లు మరీ చల్లగా వుంటే కొద్దిగా వేడి నీరు కలిపి పోసుకోవచ్చు. వారానికి రెండు సార్లు కుంకుడు కాయ రసంతో తలంటుకోవాలి. చుండ్రు మరీ ఎక్కువగా వున్నప్పుడు హెయిర్ కి కుంకుడు రసం బాగా పట్టించి 5, 10 నిమిషాలు అలా వుంచి.. అప్పుడు చన్నీటి స్నానం చేయాలి. సమస్య ఎక్కువగా వున్నవారు వారానికి 3 సార్లు చేయాలి.
కొబ్బరి నూనె 50 ఎమ్ఎల్.. తీసుకుని ఒక అంతే మోతాదులో నిమ్మరసం తీసుకుని.. రెండు కలిపి ఒక పాత్రలో చిన్న మంట మీద వేడి చేయాలి. బాగా మరిగాక దానిని ఒక బాటిల్ లో నిల్వ చేసుకోవాలి. ఈ ఆయిల్ ను హెడ్ బాత్ చేసే ముందు రోజు కానీ, కుదరకపోతే గంట, రెండుగంటల ముందు జుట్టుకు అప్లై చేసి బాగా మసాజ్ చేసుకున్నా డేండ్రఫ్ ప్రాబ్లెమ్ కు చెక్ పెట్టొచ్చు.
జుట్టు ఆరిన తరువాత కొబ్బరి నూనె రాసుకోవాలి. నూనె రాస్తే చుండ్రు ఎక్కువ అవుతుందనుకుంటారు. కానీ, తెల్లగా పొట్టు లేస్తున్నప్పుడు కొబ్బరి నూనె రాస్తే అది కరుచుకుపోయి సమస్య తగ్గే అవకాశం ఉంది. నూనె వల్ల హెయిర్ జిడ్డుగా అనిపిస్తే నిమ్మరసాన్ని తలకు రాసుకొని హెడ్ బాత్ చేస్తే జిడ్డు పోతుంది. తలలో జిగురు గ్రంధులు ఊరించి ఎక్కువ జిగురును శుభ్రం చేయడానికి నిమ్మరసం బాగా పనికొస్తుంది.
వేప నూనె కొద్దిగా నిమ్మరసం కలిపి జుట్టుకు పెట్టి, రెండు మూడు గంటలు ఆగి తలస్నానం చేసినా చుండ్రు సమస్య పోతుంది. అలాగే వేపాకు ముద్దను పెరుగుతో కలిపి పేస్ట్ గా చేసుకోవాలి. ఈ ముద్దను తలస్నానం చేసే గంట ముందు అప్లై చేసి గోరు వెచ్చని నీటితో హెడ్ బాత్ చేయాలి. వేపలో ఉండే యాంటీ ఫంగల్ లక్షణాలు, పెరుగులోని చల్లదనం చుండ్రును పోగొడతాయి. అంతే కాదు కుదుళ్లను బలపరచి, హెయిర్ సిల్కీగా కనిపిస్తుంది.