వేసవిలోనూ వేధించే టాన్సిల్స్‌కు చెక్ పెట్టండి..

చలికాలంలోనే కాదు కొంతమందికి వేసవిలోనూ టాన్సిల్స్ సమస్య ఉన్నవారికి
చల్లని వస్తువులు తింటున్నప్పుడు.. నరకం కనిపిస్తుంది. చాలామంది పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా చాలా మంది టాన్సిల్స్‌తో ఇబ్బంది పడుతూ ఉంటారు. మనం తినే ఆహారంలో, తాగే నీళ్లలో, పిల్చే గాలిలో ఉండే..కాలుష్యాలు, విషపదార్థాలు, సూక్ష్మక్రిములు శరీరంలోకి వెళ్లకుండా టాన్సిల్స్ అడ్డు కట్ట వేస్తాయి.

వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల ఒక్కోసారి టాన్సిల్స్‌ వాపునకు గురవుతుంటాయి. దాంతో తీవ్రమైన నొప్పి మొదలవుతుంది. దీనివల్ల తినడానికి, తాగడానికే కాదు మాట్లాడటానికి కూడా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. కొందరికైతే జ్వరం కూడా వచ్చేస్తుంది. అయితే అలాంటి సమయంలో ఇప్పుడు చెప్పబోయే బెస్ట్ అండ్ సింపుల్ చిట్కాలను పాటిస్తే ఈజీగా టాన్సిల్స్ సమస్యను నివారించుకోవచ్చని డాక్టర్లు చెబుతున్నారు.

టాన్సిల్స్‌తో ఇబ్బంది పడే వారు.. తులసి టీ, అల్లం టీ, దాల్చిన చెక్క టీ, పసుపు టీ వంటివి తీసుకున్నా కూడా మంచి ఫలితం ఉంటుంది. ఇక టాన్సిల్స్ వాపునకు గురైనప్పుడు సిట్రస్ పండ్లు, చల్లని ఆహారాలు, నూనెలో వేయించిన ఆహారాలు, ఫాస్ట్ ఫుడ్స్ కు దూరంగా ఉండాలి. వాటర్ ఎక్కువగా తాగుతూ ఉండాలి. ఉప్పు వేసిన గోరు వెచ్చటి నీటితో తరచూ పుక్కిలిస్తూ ఉంటే టాన్సిల్స్ వాపు త్వరగా తగ్గుతుందని డాక్టర్లు సూచిస్తున్నారు.

టాన్సిల్స్ వాపును తగ్గించడంలో వేపాకు ఎఫెక్టివ్‌గా పని చేస్తుంది. ఒక గ్లాస్ వాటర్‌లో స్పూన్ వేపాకు పొడి లేదా కొన్ని వేపాలు వేసి బాగా మరిగించి.. ఫిల్టర్ చేసుకోవాలి. గోరు వెచ్చగా అయిన తర్వాత చిటికెడు నల్ల ఉప్పు కలుపుకొని తాగాలి. ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
అలాగే టాన్సిల్స్‌తో బాధపడేటప్పుడు కొందరు పెరుగును అస్సలు వాడరు. కానీ, పెరుగును కచ్చితంగా తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు. అందులోనూ ఒక కప్పు పెరుగులో స్పూన్ తేనె, స్పూన్ నిమ్మరసం యాడ్ చేసుకుని తీసుకుంటే.. టాన్సిల్స్ సమస్య ఇంకా త్వరగా తగ్గుతుంది. ఇంకా గొంతునొప్పి, గొంతు వాపు వంటివి సైతం తగ్గిపోతాయి.